కావలి పరిధిలోని ఓ పంచాయతీకి చెందిన కొందరు బెంగళూరులో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. ఉపాధి కోసం ఏటా వలస వెళ్లే వీరు.. గత ఏడాది కరోనా కారణంగా స్వస్థలంలోనే ఉండిపోయారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో బతుకుదెరువుకు బెంగళూరు బాట పట్టారు. పండగ తర్వాత పలువురు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోగా.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కావడంతో వెనక్కు రప్పించడంపై నాయకులు దృష్టి పెట్టారు. అనేక రకాలుగా తాయిలాలతో ఎరవేసేందుకు కసరత్తు చేస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
కొండాపురం మండలంలోని మరో పంచాయతీకి సంబంధించీ ఇదే పరిస్థితి నెలకొంది. చెన్నైలో ఉపాధి పొందుతున్న వారిని పంచాయతీ ఎన్నికలకు రప్పించాలని రెండు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రవాణా వాహనాలు, ఖర్చులతో పాటు రోజు వారీ కూలి సొమ్మునూ అందించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఓ దశలో ఆయా పార్టీల నాయకులు ఈ విషయంలో ఎవరికి వారు పోటీ పడుతుండటం చర్చనీయాంశమైంది.
ఆన్‌లైన్‌లో డబ్బు పంపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రవాణా వాహనాలను సమకూర్చడం నుంచి దారి ఖర్చులు ఇవ్వడం వరకూ అనేక రకాల ఒప్పందాలకు దిగుతున్నారు. అవసరమైతే.. ఆ రెండు, మూడు రోజులకు రెట్టింపు కూలి ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు. ఈ విషయంలో పార్టీల వారీగా పోటీ నెలకొనగా.. పంచాయతీల వారీగా ‘గుర్తింపు’ ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. ఓటరు జాబితాలు ముందుంచుకుని వలస ఓటర్ల వివరాలపై ఆరా తీస్తుండటం చర్చగా మారింది.
పల్లెల్లో ఎనలేని సంబరం..
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. పల్లెల్లో ఎనలేని సంబరం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలంటే, ఆ కోలాహలమే వేరు. ప్రస్తుతం ఆ పరిస్థితి సింహపురి పల్లెల్లో ప్రస్పుటమవుతోంది. మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. తొలిదశలో కావలి రెవెన్యూ డివిజన్‌కు ఈ నెల 9న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఈ దశలో మొత్తం 9 మండలాల్లో ఎన్నిక జరుగుతుండగా.. ప్రస్తుతం అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా తెదేపా, వైకాపా మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఏకగ్రీవాల దిశగా వైకాపా తీవ్రంగా యత్నిస్తుండగా.. బరిలో నిలిచేందుకు తెదేపా వ్యూహాలు సిద్ధం చేస్తోంది.