నెల్లూరు జిల్లా ఎస్ పేట గ్రామంలోని గిరిజన కాలనీలో విషాదం జరిగింది. ఈత సరదా... ఓ బాలుడి ప్రాణాన్ని బలిగొంది. గిరిజన కాలనీకి చెందిన ముగ్గురు పిల్లలు మంగళవారం మధ్యాహ్నం ఈత కొట్టేందుకు గ్రామ శివారులోని బీరాపేరు వాగు వద్దకు వెళ్లారు. ముగ్గురిలో సెల్వ అనే బాలుడికి ఈత రాక.. నీటిలో మునిగిపోయాడు. తమ కళ్ళముందే స్నేహితుడు నీటిలో మునిగిపోవడంపై భయపడిపోయిన మిగిలిన ఇద్దరు స్నేహితులు ఇంటికి వెళ్ళిపోయారు.
చీకటి పడుతున్నా.. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో సెల్వ కుటుంబ సభ్యులు గాలించి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న పిల్లలు వాగు వద్ద ఉండడాన్ని గమనించిన కొందరు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపగా.. వెంటనే వాగులో గాలింపు చేపట్టి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన బాలుడు.. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.