అధికార, ఆర్థిక, అంగబలంతో ఎలాగైనా తిరుపతి ఉప ఎన్నికలో గెలిచేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. ముందు ఏడు లక్షల మెజార్టీతో గెలుస్తామని ప్రకటించి.. ఇప్పుడు మూడు లక్షలకు పడిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి ఎన్నికల కోసం రెండు లక్షల నకిలీ ఓటర్ ఐడీ కార్డులను సృష్టించారని ఆరోపించారు. రూ. 200 కోట్లు ఖర్చు పెట్టైనా..ఎన్నికల్లో గెలిచి ప్రతిష్ఠ నిలుపుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రచారం లేకుండా.. కటౌట్‌తోనే విజయం సాధిస్తామని ప్రకటించినవారు, ఇప్పుడు భాజపా-జనసేన కూటమిని చూసి జగన్‌ను స్వయంగా ప్రచారానికి దింపుతున్నారన్నారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి లేఖలు రాయడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర నిధులు లేకుండా ఏ సంక్షేమ పథకం అమలవుతుందో, రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులపాల్జేస్తున్నారో కూడా లేఖల ద్వారా తెలియజేయాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ నెల 12న జరిగే ఎన్నికల ప్రచారంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పవన్ కల్యాణ్‌లు పాల్గొంటారని తెలిపారు.