రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతోనే కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ వెల్లడించారు. నెల్లూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు చట్టాలపై అసత్య ప్రచారం చేస్తూ, రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. వైకాపా, తెదేపా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు.
నూతన వ్యవసాయ చట్టాలపై రైతాంగాన్ని చైతన్యం చేసేలా సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 29న సర్వేపల్లి, వచ్చే నెల 7న కోవూరులో సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. భాజపా జాతీయ నాయకులు సైతం హాజరవుతారని వివరించారు. కాంగ్రెస్, వామపక్షాలు రైతాంగాన్ని రెచ్చగొడుతూ మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలతో కలిగే లబ్ధిపై అవగాహన పెంచుకోవాలని కోరారు.