నెల్లూరు జిల్లాలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా అరటిని రైతులు సాగు చేశారు. ఇక్కడ పండించిన పంటను చెన్నైకి తరలించేవారు. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటం వల్ల రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. దీని వల్ల పంట అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా ప్రభావం.. మరోవైపు ఇటీవల కురిసిన అకాల వర్షాలు తమను నష్టాల్లోకి నెట్టాయని వాపోయారు. పంట రవాణా లేక అరటి పొలాల్లోనే కుళ్లిపోతుందని కన్నీరు పెడుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
లక్షలు పెట్టుబడి పెట్టి అరటి సాగు చేశామని.. చివరకి ఫలితం చేతికందే సమయానికి తమను కరోనా.. అకాల వర్షం పూర్తిగా కోలుకోలేని దెబ్బతీశాయని రైతులు వాపోయారు. వేరే దిక్కు తోచక కొంతమంది రోడ్లపైనే పండ్లను అమ్ముకుంటున్నారు. మరికొంత మంది ఆటోలపై ఇతర గ్రామాల్లో తిరిగి అమ్మకాలు జరుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.