మూడు వేల ఎకరాల భూములకు సాగునీరందించాలన్న లక్ష్యంతో అయిదు దశాబ్దాల కిందట మొదలు పెట్టిన కాలువ అది. రూ. కోట్లు ఖర్చు చేశారు. కానీ, ఎకరం నేల తడవలేదు. కారణం అసంపూర్తి పనులే. ఇదీ బద్వేలు కాలువ కథ. చేజర్ల మండలంలోని పెన్నా తీర గ్రామాల భూములకు సాగునీరందించే ఏటి కాలువలు వరదలు, భారీ వర్షాల సమయంలో తెగిపోయి ఆయకట్టు రైతులు అవస్థలు పడేవారు. ఆ సమస్యను పరిష్కరించేందుకు కలువాయి నుంచి చేజర్ల వరకు నదికి సమాంతరంగా ఓ కాలువ తవ్వాలని 1970లో రూపకల్పన చేశారు. దానికి బద్వేలు రివర్ ఛానల్‌గా నామకరణం చేసి.. అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. కొంత మేర కాలువలు తవ్వారు. సోమశిల జలాశయ నిర్మాణం పూర్తి కావడంతో... దిగువకు వరదలు తగ్గాయి. దక్షిణ కాలువ నిర్మాణంతో బద్వేలు కాలువ ఆయకట్టు పరిధిలోని కొంత భాగం అందులో చేరింది. కాలక్రమంలో బద్వేలు కాలువకు కాలదోషం పట్టింది. నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇందుకు సేకరించిన భూములు ఆక్రమణకు గురై పంట పొలాలుగా మారిపోయాయి.
అలా.. మళ్లీ తెరపైకి
2010లో మొదలైన జలయజ్ఞంలో ఈ కాలువ మళ్లీ తెరపైకి వచ్చింది. నదిలోని కట్టుగొమ్మల నుంచి కాకుండా నేరుగా జలాశయం నుంచి ఆయకట్టుకు నీరందించాలని రూ. ఆరు కోట్లతో పనులు మొదలుపెట్టారు. కొంత మేర పనులు చేశారు. రూ. 3కోట్లకుపైగా నిధులు ఖర్చు పెట్టారు. ఇంతలో పనులు చేపట్టిన గుత్తేదారు చనిపోవడంతో అంతటితో ఆగిపోయాయి. ఆపై కొన్ని ఆరోపణలు, విమర్శలు రావడంతో పనులు నిలిచిపోయాయి.
ఉన్నవీ పోయే..
కోటితీర్థంలోని మెట్ట భూములకు దక్షిణ కాలువలో 2ఎల్ నుంచి నీరందించేందుకు నాలుగు ఉపకాలువలు తవ్వారు. వాటికి అడ్డంగా బద్వేలు కాలువ నిర్మించారు. కానీ, ఉప కాలువల నుంచి భూములకు నీరొచ్చేలా వంతెనలు నిర్మించ లేదు. ఫలితంగా అక్కడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పనులు సకాలంలో పూర్తయి ఉంటే నాలుగు వేల ఎకరాలకు సమృద్ధిగా నీరందేది. అసంపూర్తి పనుల కారణంగా కొత్త ఆయకట్టు రాకపోగా.. ఉన్న వసతి దూరమైంది. సోమశిల-1 డివిజన్ పరిధిలో ఉన్న ఈ కాలువను.. ఆ పరిధిలోకి చేర్చకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.