ఎన్నికల నిర్వహణలో మాస్టర్ ట్రైనర్లు నిబద్ధతతో పనిచేయాలని, పీవోలు, ఏపీవోలు కూడా ఎన్నికల శిక్షణ బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తిక్కన భవన్‌లో శనివారం ఉప ఎన్నికలకు సంబంధించిన మాస్టర్ ట్రైనర్లకు మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో మాస్టర్ ట్రైనర్లు, పీవోలు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. మానవ తప్పిదాల కారణంగా రీ-పోలింగ్ జరిగే పరిస్థితి రానీయవద్దన్నారు.
ఈవీఎం యంత్రాలు, వీవీపీఏటీలపై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు. కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే విధులు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలకు, వీవీపీఏటీలకు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం సీల్ వేయాలని, ఎన్నికల పత్రాలన్నిటికి సీల్ వేసి ఈవీఎంలతో పాటే స్ట్రాంగ్ రూమ్‌కు చేర్చాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అంతా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుని ఆదర్శంగా నిలవాలన్నారు. సమావేశంలో జేసీలు హరేంధిరప్రసాద్, డాక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, టి.బాపిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్‌కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఆర్డీవోలు, మాస్టర్ ట్రైనర్లు, తహసీల్దారు, అధికారులు పాల్గొన్నారు.