TDP state spokesperson Anam Venkataramana Reddy : ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ఎండగట్టడంతో పాటు టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై గుర్తు తెలియని ఆగంతకులు దాడికి యత్నించడం కలకలం రేపింది. ఆదివారం నెల్లూరు నగరంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేయించారని ఆనం వర్గం టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరులో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం
14:23 June 04
బైకులపై వచ్చి కర్రలతో దాడికి యత్నించిన 10 మంది దుండగులు
నెల్లూరు ఆర్టీఏ కార్యాలయం దగ్గర్లోని ఆనం కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆనం వెంకటరమణారెడ్డి కార్యాలయం నుంచి కిందకు వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన సుమారు ఎనిమిది మంది దుండగులు.. కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. ఆనం అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలు సికిందర్ రెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు అడ్డుకోవడంతో కర్రలు, ద్విచక్ర వాహనాలు అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ఘటనలో ఆనం వెంకట రమణారెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇటీవల కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలపై, ముఖ్యమంత్రితో పాటు ఇతర నాయకుల అవినీతిపై ఘాటుగా మాట్లాడుతున్న నేపథ్యంలో దాడికి యత్నించారని ఆనం, టీడీపీ నాయకులు భావిస్తున్నారు.
గుణపాఠం చెప్తాం.. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి వైఎస్సార్సీపీ మూకల పనేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఉలిక్కి పడుతున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఉలికిపాటు అని ప్రశ్నించారు. తెలుగుదేశం వాయిస్ బలంగా వినిపిస్తున్న ఆనం వెంకటరమణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగిన వైఎస్సార్సీపీ ఫ్యాక్షన్ ముఠాలకి తగిన గుణపాఠం చెబుతాం అని హెచ్చరించారు.
ప్రతి దాడులు తప్పవు.. ఆనం వెంకటరమణా రెడ్డిపై దాడి ప్రయత్నాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంకటరమణారెడ్డిపై దాడికి ప్రయత్నించారనే సమాచారం తెలియడంతో టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పలువురు హుటాహుటిన సంఘటనా స్థలం చేరుకున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు బరితెగిస్తున్నారని, నెల్లూరు జిల్లాలో పట్టపగలు దాడులు చేసే కొత్త సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసిరారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలిపితే ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి చేతులు దులుపుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు.. మీరు గొడవలు పెట్టుకోవాలనుకుంటే సమయం చెబితే సిద్ధంగా ఉంటామని అన్నారు. దాడికి ప్రతి దాడులు తప్పవని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.