నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని చంద్రపడియ వద్ద ఉన్న వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కర్మాగారంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.40 లక్షల వంతున పరిహారం అందిస్తున్నట్లు ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ కర్మాగారం యాజమాన్యంతో చర్చించి ఎక్స్‌గ్రేషియాపై నిర్ణయం తీసుకున్నామన్నారు. తొలుత రూ.34 లక్షల ఎక్స్‌గ్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయం చర్చించగా... మృతుల కుటుంబాల వారు ఉద్యోగ హామీని తిరస్కరించడంతో రూ.40 లక్షల నష్టపరిహారానికి అంగీకరించారని తెలిపారు.
ఈ సంఘటనపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను బుధవారం పంపామని తెలిపారు. యాజమాన్యం ఇచ్చే డబ్బుతోపాటు.. ప్రభుత్వం నుంచి సైతం పరిహారం అందుతుందని స్పష్టం చేశారు. ప్రమాద సంఘటనపై నలుగురు సభ్యులతో కూడిన సంయుక్త కమిటీ అధ్యయనం అనంతరం మూడు రోజుల్లో నివేదిక తయారు చేస్తారన్నారు. కర్మాగారంపై కేసు నమోదు చేసినట్లు కలిగిరి సీఐ జీఎల్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై ఎ.బాజిరెడ్డితో కలసి కర్మాగారంలో బుధవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో నమూనాలు సేకరించి గుంటూరు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపేందుకు సీజ్ చేశారు.