Atal Tinkering Labs : మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్ధి దశ నుంచి సృజనాత్మకతను పెంచడం కోసం సాంకేతికతను విద్యార్ధుల చెంతకు తీసుకు వచ్చింది. ఇంజనీరింగ్ కళాశాల స్థాయిలో ఉండే ల్యాబ్‌ను పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేశారు. వాటినే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని నామకరణ చేశారు. విద్యార్థికి వచ్చిన ఎటువంటి ఆలోచన అయినా వెంటనే ఆచరణలో పెట్టేందుకు పాఠశాల స్థాయిలో ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్సాహంగా పరికరాలను తయారు చేస్తున్న నెల్లూరు విదార్ధుల మేథస్సును ఒక్కసారి చూద్దాం..
నైపుణ్యాలకు పదును పెట్టేందు కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లను మంజూరు చేసింది. నెల్లూరు జిల్లాలో 2019 నుంచి 36 ఉన్నత పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ల్యాబ్‌కు మొదటి సంవత్సరం 10 లక్షలు, రెండో సంవత్సరం మరో 10 లక్షలు మంజూరు చేశారు. చక్కటి తరగతి గదిలో ఏర్పాటు చేశారు.
నెల్లూరులోని 36 పాఠశాలల్లో విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా పరికరాలు తయారు చేస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తున్నారు. వారికి వచ్చిన ఆలోచనను ఈ ల్యాబ్ లో కార్యరూపం దాలుస్తోంది. విద్యార్ధికి ఖర్చు లేకుండా ఈ ల్యాబ్‌లో రోబోలను, స్వీపింగ్ మిషన్లు, రైతులు పొలాల్లో వినియోగించే యంత్ర సామగ్రి తయారు చేస్తున్నారు. మోడల్‌గా తయారు చేస్తున్న యంత్రాలను చూస్తే విద్యార్ధుల్లో ఎంత మేథస్సు దాగి ఉందో అర్థం అవుతుంది.
అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణను సైన్స్ ఉపాధ్యాయుడికి అప్పగించారు. ల్యాబ్ లో అనేక విడిభాగాలను ఏర్పాటు చేశారు. విద్యార్ధులు వాటిని కలిపి యంత్ర పరికరాలను తయారు చేస్తున్నారు. ఎంతో ఉపయోగంగా ఉందని విద్యార్ధులు అంటున్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయు బోధించే దానికన్నా ప్రయోగశాలలో తయారు చేయడం ఎంతో గొప్పగా ఉందని వారు అంటున్నారు.