AQUA FARMERS CURENT BILL PROBLEMS : నెల్లూరు జిల్లాలో రొయ్యల, చేపల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెరిగిన పెట్టుబడులతో అల్లాడుతున్న చేపల, రొయ్యల రైతులకు.. ప్రభుత్వం ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి భారీగా కరెంటు బిల్లులు పెంచడంతో ఏం చేయాలో అర్థం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా జోన్లు ఎత్తివేయాలంటూ రైతులు చెబుతున్నారు.
జిల్లాలోని తీర ప్రాంతాలైన కావలి, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు తదితర మండలాలలో ఎక్కువగా రైతులు చేపలు రొయ్యలు సాగు చేస్తుంటారు. సీడ్, ఫీడ్ ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆక్వా, చేపల రైతులపై ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఆక్వా జోన్లు ఏర్పాటు చేసి ప్రతి రైతు ఆక్వా జోన్ల పరిధిలోకి రావాలని చెప్పటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటివరకు యూనిట్కి రూపాయి 50 పైసలు కరెంట్ బిల్లు కడుతున్న రైతులు, జోన్లు ఏర్పాటు చేయడంతో యూనిట్కి 6 రూపాయల 50 పైసలు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తుందని ఆక్వా చేపల రైతులు మండి పడుతున్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని రైతు నాయకుల మండిపడుతున్నారు. భారతదేశంలో మన రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చే ఆక్వా ఉత్పత్తులపై ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆక్వా జోన్లు తీసివేసి, రైతులకు యూనిట్కి రూపాయి 50 పైసలకు కరెంటు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.