నెల్లూరు నగరంలో ఆప్కో అధీనంలో రూ.150 కోట్ల విలువ చేసే స్థలం ఉంది. అందులో కొంత భాగం ఇతర శాఖల చేతుల్లోకి వెళ్లింది. మిగిలిన భూమిని పరిరక్షించుకునేందుకు ఆ సంస్థ అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. చేనేత, జౌళి అనుబంధ రంగాలకే ఆ స్థలాన్ని ఉపయోగించాలన్న డిమాండ్ ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఇదీ విషయం
నగరంలోని అయ్యప్పగుడి సమీపంలోని వెంగళ్‌రెడ్డినగర్- గాంధీనగర్ మధ్య 1970-80 కాలంలో 6.90 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం ఆప్కోకు చెందిన హీట్ సెట్టింగ్ ప్లాంట్ ఏర్పాటుకు కేటాయించింది. నిర్మాణం చేపట్టినా.. అనూహ్యంగా అది మూతపడటంతో భవనాలు నిరుపయోగంగా మారాయి. మిగిలిన స్థలంలో పిచ్చి మొక్కలు మొలిచాయి. ఉమ్మడి రాష్ట్రంలో కీలక నిర్మాణాలు హైదరాబాద్‌లో చేపట్టడంతో ఇక్కడి స్థలం అలంకారప్రాయంగా మిగిలింది. రాష్ట్ర విభజనానంతరం విరివిగా నిర్మాణాలు చేపట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ప్రస్తుతం అవి కాస్త ఇతర శాఖల చేతుల్లోకి వెళ్లిపోతుండటం సమస్యగా మారింది.
జరిగిన కేటాయింపులు
నెల్లూరులోని 6.90 ఎకరాల ఆప్కో స్థలంలో ఏపీ సీడ్స్‌కు ఎకరా, ఇంటెలిజెన్స్ భవన నిర్మాణానికి 0.16 సెంట్లు కేటాయిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. మిగిలిన 5.74 ఎకరాల్లో మరికొన్ని ప్రభుత్వ శాఖల భవనాలు నిర్మించేందుకు అడుగులు వేస్తున్నారు. అగ్రికల్చర్ ల్యాబ్ ఏర్పాటుకు 1.10 ఎకరాలు, డీఎస్వో కార్యాలయానికి 0.40 సెంట్లు, రైతు బజారుకు 0.50 సెంట్లు, జాయింట్ కమిషనర్, సేల్స్‌టాక్స్ కార్యాలయ నిర్మాణానికి 0.50 సెంట్లు కేటాయించారు. 0.50 సెంట్లు నుడా కార్యాలయం, 1.34 ఎకరాలు రోడ్ల నిర్మాణానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఓ ఉన్నతాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పట్లో ఆయా శాఖలు తమకు భూమి అవసరమని అభ్యర్థించినా.. ఆప్కో అధికారులు ఎలాంటి నిరభ్యంతర పత్రం ఇవ్వనట్లు సమాచారం. అక్కడ శిథిలాల తొలగింపు ప్రారంభం కావడం, కొత్త భవన నిర్మాణాల దిశగా అడుగులేస్తుండటంతో ఆప్కో వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. వారం రోజులకింద సదరు ప్రాంతీయ అధికారులు స్థలం పరిశీలించి వెళ్లారు. ఆప్కోకే ఆ భూమి కొనసాగించాలని జిల్లా ఉన్నతాధికారులను అభ్యర్థించారు. భారీ గోదాములు, డిజైన్ స్టూడియో తదితర నిర్మాణాలకు అనువుగా ఉంటుందని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి ఆప్కో ఉన్నత వర్గాలు.. జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ప్రస్తుతం పైకప్పు తొలగిస్తుండటం.. అగ్రిల్యాబ్ నిర్మాణానికి కసరత్తు జరుగుతుండటంతో పరిస్థితులు వాడీవేడిగా మారాయి.