ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదు: సింఘాల్ - వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి

ఆయుష్‌ కమిషనర్‌ ప్రాథమిక సమాచారం మేరకు ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకోనుంది. దీన్ని ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శాస్త్రీయతపై నిర్ధారణ, ఇతర అనుమతులు అసరమవుతాయని అధికారులు తెలిపారు. ఈ ఔషధానికి ఆమోదం లభిస్తే తయారీకి సిద్ధమని తితిదే తెలిపింది.

anandayya-medicine-distribution
ఆనందయ్య మందు పంపిణీ

By

Published : May 24, 2021, 7:17 AM IST

ఆనందయ్య మందు పంపిణీ

ఆయుష్ కమిషనర్‌ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి అభ్యంతరం లేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. వంశపారంపర్యంగా ఆయన ఈ మందు తయారుచేసి ఇస్తున్నారని, వీటిలో ఉపయోగిస్తున్న పదార్థాలతో హాని లేనట్లు వెల్లడైందని చెప్పారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. అయితే ఆయుర్వేద మందుగా దీన్ని గుర్తించడం లేదని, అలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయతపై నిర్ధారణ, ఇతర అనుమతులు అవసరమవుతాయని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వివరించారు.

ఆనందయ్య మందును ప్రజలకు చేరువ చేయడంపై ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఆనందయ్యతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ఆనందయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారని, రహస్య ప్రాంతాలకు తరలించారనేది అపోహలే అన్నారు. ఆనందయ్య మందును ఆయుష్‌, ఐసీఎమ్​ఆర్, ప్రభుత్వం ఆమోదిస్తే తితిదే ఆధ్వర్యంలో తయారుచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. మందు వల్ల దుష్పరిణామాలు లేవని తెలిసినా దాన్ని ఇమ్యూనిటీ బూస్టర్‌గానే అందిస్తామని వివరించారు. ఆనందయ్య వాడుతున్న వనమూలికలు నిత్యజీవితంలో వాడేవేనని అయితే వాటన్నింటినీ కలిపితే వచ్చే ఫలితాలను మాత్రం పరిశీలించాల్సి ఉందని ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ తెలిపారు.

కృష్ణపట్నం మందుపై ప్రభుత్వం త్వరగా ప్రకటన చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. ప్రభుత్వం ఇందులో లాభాపేక్ష చూడకుండా వాస్తవాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగకరమైతే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. విచారణ వేగవంతం చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details