రక్షణ లేని శిథిల, అద్దె అంగన్‌వాడీ భవనాల్లో చిన్నారుల జీవితాలు మొదలవుతున్నాయి. జిల్లాలో 17 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 3774 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1.70 లక్షల మందికిపైగా చిన్నారులు నమోదయ్యారు. వీరికి పౌష్ఠికాహారంతో పాటు ఆటపాటలతో బోధన ఇస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో ఎక్కువ మంది పేద కుటుంబాల వారే. అలాగే ఈ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్ఠికాహారం అందజేస్తున్నారు. నిత్యం చిన్నారులు, మహిళలు ఉండే ఈ కేంద్రాలు అభద్రతకు నిలయంగా మారాయి. ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. జిల్లాలో చాలావరకు అంగన్‌వాడీ భవనాలు ముళ్ల చెట్ల పక్కన, చెరువుల అంచున నిర్మించారు. దాదాపు 90 శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రహరీల నిర్మాణం లేదు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే తేళ్లు, పాములు కేంద్రాల్లోకి వస్తుంటాయి. చిన్నారులు విష పురుగుల కాట్లకు గురవుతున్న సందర్భాలున్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో జరిగాయి. అధికారుల ముందుచూపు లేకుండా పోవడమే ఇందుకు కారణంగా నిలుస్తోంది. సర్వేపల్లితోపాటు కోవూరు, గూడూరు, ఆత్మకూరు, తదితర నియోజకవర్గాల్లో కేంద్రాలు పొలాల్లో ఉన్నాయి. గ్రామం చివర నిర్మించడంతో పాటు ప్రహరీలు లేకపోవడంతో ప్రమాదకరంగా ఉన్నాయి.
ఇవిగో ఘటనలు
వెంకటాచలం మండలంలోని కసుమూరు పంచాయతీ వెంకటకృష్ణాపురం వడ్డిపాళెం అంగన్‌వాడీ పాఠశాలను ముళ్ల చెట్ల మధ్య ఉంది. ఏడాది క్రితం పాఠశాలలో ఉన్న విద్యార్థిని బండి వర్షిణికి తేలు కుట్టింది. రెండు రోజుల పాటు చిన్నారి ఆరోగ్యం విషమంగా మారింది. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలందించేలా చేశారు. నాలుగు రోజులకు చిన్నారి కోలుకుంది.
●*●కోవూరు పట్టణంలోని పెళ్లకూరు కాలనీలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీ లేకపోవడంతో ఏడాది క్రితం కట్లపాటు వచ్చింది. గుర్తించిన సహాయకురాలు ధైర్యంగా దీన్ని కొట్టి చంపింది. సహాయకురాలు గుర్తించకుంటే పిల్లలు ప్రమాదంలో పడేవారు.
●*వెంకటాచలం మండలంలోని ఒక కేంద్రంలో ఏడాది క్రితం అంగన్‌వాడీ భవనం శ్లాబు పడి ఒక చిన్నారి తలకు గాయమైంది. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు.