ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికార పార్టీ ఘనంగా నిర్వహించింది. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని జిల్లాల్లో అమరజీవి పొట్టిశ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

By

Published : Nov 1, 2019, 9:59 PM IST

Published : Nov 1, 2019, 9:59 PM IST

Updated : Nov 1, 2019, 11:34 PM IST

రాష్ట్ర అవతరణ వేడుకలు

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

వైకాపా నాయకులు, ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే జగన్ పాలనపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. ఎక్కడికక్కడ వైకాపా నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

కడప జిల్లాలో...
కడప కళాక్షేత్రంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విడిపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన తెలిపారు. మైదుకూరు, నల్లపురెడ్డిపల్లి, రాయచోటిలోనూ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.

విశాఖ జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలు విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ భవనం వద్ద వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. విశాఖలోని వైకాపా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కర్నూలు జిల్లాలో..
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని చిల్డ్రన్ పార్క్​లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు విద్యార్థులు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనగానపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

కృష్ణా జిల్లాలో..
తాడేపల్లిలోని వైకాపా కేంద్రకార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు, వైకాపా నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు హయాంలో పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించే అదృష్టం లేకుండా చేశారనీ...ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు నేతలు తెలిపారు. మచిలీపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు.

విజయనగరం జిల్లాలో...
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు విజయనగరంలో కోలాహలంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో విజయనగర పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కలెక్టర్ హరి జవహర్ లాల్, విజయనగరం, నెలిమర్ల శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, పలువురు హాజరయ్యారు. ఎందరో మహనీయులు, త్యాగమూర్తుల కృషి ఫలితమే రాష్ట్ర అవతరణ జరిగిందని బెల్లాన చంద్రశేఖర్ గుర్తుచేశారు.

అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లా అంబేద్కర్ భవన్​లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకుని ఐక్యంగా అభివృద్ధి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పెనుగొండ మండల కేంద్రంలోనూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
కాకినాడలో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి త్యాగ ఫలంగానే ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. ఏలేశ్వరంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొని పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఘన నివాళి అర్పించారు.

ప్రకాశం జిల్లాలో..
దర్శిలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను స్థానిక ఎంపిడిఓ ఆఫీసు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ .. భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు చేసిన కృషిని కొనియాడారు.

ఇదీచూడండి

ఏ రాష్ట్రమూ.. ఇంత దగా పడలేదు: సీఎం జగన్‌

Last Updated : Nov 1, 2019, 11:34 PM IST

ABOUT THE AUTHOR

...view details