ఆమె.. అంధురాలు.. కానీ సాయం చేయడంలో అందరి కంటే గొప్పదైన సంస్కారాన్ని ప్రదర్శించిన మనసున్న మనిషి. తనకొచ్చే పెన్షన్‌నే విరాళంగా ఇచ్చేసిన గొప్ప దయాగుణం కలిగిన యువతి తను. కొవిడ్ బాధితులకు సాయం చేసేందుకు ఉన్నతమైన సేవలు చేస్తున్న నటుడు సోనూసూద్ శ్రమను తెలుసుకుని.. ఆమె స్ఫూర్తి పొందింది. ఎవరు ఎలాంటి సాయం అడిగినా.. కాదు.. లేదు.. అనకుండా సహాయం చేస్తున్న సోనూసూద్ ఫౌండేషన్‌కు ఉడతాభక్తిగా సాయం చేయాలని తలచింది. ఆమె మన నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్.. అంధురాలైన బొడ్డు నాగలక్ష్మీ.
కొవిడ్ బాధితులు పడుతున్న ఆవేదన తెలుసుకున్న నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్‌కు ఆమె 15 వేల రూపాయలను.. విరాళంగా అందించింది. అందరికీ ఆదర్శంగా నిలించింది. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ తో ప్రపంచానికి తెలియజేశారు.. సోనూసూద్. తన దృష్టిలో నాగలక్ష్మీ 'రిచెస్ట్ ఇండియన్'.. అని ప్రశంసించారు. ఇతరుల బాధను చూసేందుకు కంటిచూపు అవసరం లేదని.. ఆమె సహాయాన్ని మనసారా అభినందించారు. మీరే నిజమైన హీరో అంటూ.. ట్వీట్ చేశారు. నాగలక్ష్మీ విరాళం ఇచ్చిన 15 వేల రూపాయలు.. ఆమెకు వచ్చిన ఐదు నెలల పెన్షన్ కావడం గొప్ప విషయం.