AP Sarpanchs Sangam Samavesam updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై 26 జిల్లాలకు చెందిన గ్రామ పంచాయతీల సర్పంచులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులుగా ఎన్నికైనా రోజు నుంటి నేటి వరకు తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులను చేపట్టలేదని ఆవేదన చెందారు. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం వల్ల రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నికైన సర్పంచులకు కనీస గౌరవ మర్యాదలు దక్కటం లేదని దుయ్యబట్టారు.
సర్పంచుల నిధులు - విధులు లాగేసుకుంటున్నారు.. పంచాయతీల నిధులు, విధులకు సంబంధించి తాజాగా ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్పంచుల సంఘం సమావేశం నెల్లూరులో జరిగింది. ఈ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అన్నీ గ్రామ పంచాయతీల సర్పంచులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు దక్కాల్సిన నిధులను, విధులను లాగేసుకోని.. సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేపోయాం.. ఏపీ సర్పంచుల సంఘం, పంచాయతీ రాజ్ ఛాంబర్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైవీపీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సర్పంచులుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తున్నా.. గ్రామంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేపోయామని వాపోయారు. పంచాయతీలకు సమాంతరంగా వాలంటరీ వ్యవస్థ తీసుకురావడంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులకు కనీస గౌరవ మర్యాదలు దక్కటం లేదని ఆగ్రహించారు.