Farmers of Nellore district are on fire against CM Jagan: నెల్లూరు జిల్లాలో జీలకర బియ్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలంటూ.. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల రోజుల వరకు ధాన్యానికి గిట్టుబాటు ధరలు వచ్చినప్పటికీ.. వ్యాపారులు, రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కొంతమంది రైతులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎదుర్కొంటున్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
జీలకర బియ్యం పండించిన రైతులు నష్టపోయారు:ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''నెల రోజులపాటు ధాన్యానికి గిట్టుబాటు ధరలు వచ్చాయనీ అందరం సంతోషించాం. కానీ, వ్యాపారులు, రైస్ మిల్లర్లు సిండికెట్ కావడంతో ధరలు నెమ్మదిగా తగ్గాయి. నెల్లూరు జిల్లాలో రబీ మొదటిపంట కోతకు వచ్చింది. కొనుగోళ్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అనేకదేశాల్లో వరదలు, యుద్దం వల్ల బియ్యానికి డిమాండ్ ఏర్పడింది. గత నెల రోజులుగా ధాన్యానికి మంచి ధరలు లభించాయి. ఈ పరిస్థితుల్లో కొందరు వ్యాపారులు, మిల్లర్లు సిండికెట్ కావడంతో రెండు రోజులుగా ధరలు నెమ్మెదిగా తగ్గుతున్నాయి. నెల్లూరు జీలకర బియ్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖర్చులు పెరిగాయని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈసారి నెల్లూరు ధాన్యానికి మంచి గిట్టుబాటు ధరలు వచ్చాయి. ఇటువంటి సమయంలో వ్యాపారులు, రైస్ మిల్లర్లు రైతును దోపిడి చేసేందుకు ధరలు తగ్గించే కార్యక్రమాన్ని ప్రారంభించారని రైతులు వాపోతున్నారు.'' అని ఆయన అన్నారు.