CM Jagan lashed out at chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. నెల్లూరు జిల్లా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తాను ప్రవేశపెట్టిన పథకాలను చూడండి.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండి అంటూ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయంటూ ప్రజలకు హెచ్చరికలు చేసిన జగన్.. చుక్కల భూములపై రైతులకు సర్వ హక్కులను కల్పిస్తున్నామని ప్రకటించారు.
చుక్కల భూమిపై రైతుకు సర్వ హక్కులు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించి.. ఆ భూములపై రైతులకు సర్వ హక్కులను కల్పించే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేశామని, రిజిస్ట్రేషన్ 22(1)ఏ నుంచి చుక్కల భూములను డీనోటిఫై చేశామని, ఆ భూములపై రైతులకు సర్వ హక్కులను కల్పిస్తున్నామని, దాదాపు 2,06,171 ఎకరాల భూములకు ఈరోజు నుంచే సంపూర్ణ హక్కులు లభించాయని..సుమారు రూ.20 వేల కోట్ల విలువ చేసే విలువైన భూములకు సంపూర్ణ హక్కును కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
చంద్రబాబు, పవన్‌లపై జగన్ విమర్శలు..కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ''ఎన్నికలు వస్తున్నాయని.. చంద్రబాబు, పవన్ బాబులు రోడ్డెక్కారు. ప్రజలకు హెచ్చరిస్తున్నా.. వారి ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. నా పథకాలను చూడండి. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయండి. పొరపాటున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే గనక DPT జరుగుతుంది. అంటే.. దోచుకో, పంచుకో, తినుకో.. అనే పద్ధతిలో పాలన జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు రైతులను చంద్రబాబు దగా చేశాడు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాం అంటున్న దత్త పుత్రుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. ఆయన ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారమే ప్యాకేజీ స్టార్ ఒకాయన వచ్చి డైలాగులు చెప్తున్నాడు. వీరిద్దరి మాటలను ప్రజలు నమ్మవద్దు'' అని ఆయన అన్నారు.