ఆనందయ్య తన స్వగ్రామం చేరుకున్నారు. ఈ నెల 21వ తేదీన చివరగా ఆనందయ్య మందు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆనందయ్యను పోలీసు రక్షణలో ఉన్నారు. ఇంటికీ వెళ్లలేదు. ఈ క్రమంలో ఆనందయ్య శుక్రవారం మధ్యాహ్నం కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆయన ఇంటి వద్దకు వచ్చారు. ‘మీరు బయట ఉండటం మంచిది కాదు. ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి’ అని ఆయనకు చెప్పారు. దానికి ఆనందయ్య భార్య ఇంద్రావతి స్పందిస్తూ... 'ఆయన ఏ మందూ తయారు చేయడు. ఇంటి దగ్గరే ఉంటాడు' అని ఆవేదన వ్యక్తం చేశారు.
సాయంత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆనందయ్యను తీసుకువెళితే ఒప్పుకొనేది లేదని గట్టిగా చెప్పారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 5 గంటల సమయంలో ఆనందయ్య బయటకు వచ్చి.. మైక్‌లో మాట్లాడుతూ.. ‘తాను ఎక్కడికీ వెళ్లను. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. మందు తాయారు చేస్తా. ముందుగా గ్రామంలోని వారందరికీ ఇస్తా’ అన్నారు. కొద్దిసేపటికి గ్రామస్థులు ఇళ్లకు వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. ఔషధ తయారీకి ముడి పదార్థాలు సిద్ధంగా లేవని, వదంతులు నమ్మిఎవరూ రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.