కరోనా బారినపడి, క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవారు చివరి అవకాశంగా వారంతటవారు వచ్చి ఆనందయ్య ఇచ్చే కంటి చుక్కల మందు తీసుకుంటామంటే అనుమతించే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు(High Court) ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంటి చుక్కల మందు పంపిణీకి నిపుణుల కమిటీ సిఫారసు చేయలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చెప్పారు. దీంతో ఈ మందు పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు(High Court) న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్‌తో కూడిన ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది. కృష్ణపట్నం గ్రామంలో కొవిడ్‌కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధాల పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని ఆనందయ్య హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో మరో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు ఉన్నాయి.
మరోసారి పరీక్షలు చేయాలి: ఎస్‌జీపీ
గురువారం జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఇటీవల అనుమతిచ్చిన ఔషధాలతో పాటు ‘కె’ మందు పంపిణీకి అభ్యంతరం లేదన్నారు. కంటి చుక్కల పంపిణీకి నిపుణుల కమిటీ సిఫారసు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు. స్టెరిలిటీ పరీక్షలో కంటి చుక్కల మందు అర్హత సాధించలేదన్నారు. మరోసారి పరీక్షలు అవసరమని, వాటి నివేదికలు రావడానికి 2, 3 వారాల సమయం పడుతుందని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్లిష్టపరిస్థితుల్లో ఉన్నవారు తమంతట తాము వచ్చి కంటి మందు తీసుకునేందుకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలని ప్రతిపాదించింది.