ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుజలం.. అందేదెన్నడో? - Nellore district news

ఫ్లోరిన్‌ ప్రభావిత ప్రాంతాలకు శుద్ధి నీరు అందించి వ్యాధుల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకానికి గ్రహణం పట్టింది. పనులన్నీ పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో తాగునీరు అందుతుందో లేదోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

NTR Sujala Sravanti Scheme
NTR Sujala Sravanti Scheme

By

Published : May 4, 2021, 3:24 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకంలో శుద్ధి జలం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగేళ్ల కిందట రూ.4.09 కోట్లతో శుద్ధి జల కేంద్రాన్ని నిర్మించారు. దీనికి అనుబంధంగా మండల వ్యాప్తంగా 24 పంచాయతీల్లో 28 మినీ ప్లాంట్లను కూడా ఏర్పాటుచేశారు. మర్రిపాడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమీపంలో మదర్‌ ప్లాంటు నిర్మాణం చేశారు. దీనికి నీరు అందించేందుకు బొగ్గేరులో నాలుగు, మదర్‌ ప్లాంట్ దగ్గర రెండు బోర్లు కూడా వేశారు. మదర్‌ ప్లాంట్‌కు వచ్చిన నీటిని శుద్ధి చేసి మినీ ప్లాంట్లకు సరఫరా చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. ఇందుకు పైప్‌లైన్‌ వేసి, విద్యుత్తు సరఫరా పనులు కూడా పూర్తి చేశారు. పనులన్నీ పూర్తయినా ఇంతవరకు దీన్ని ప్రారంభించలేదు. చుక్క నీరు కూడా అందలేదు.

రూ. 2కే బిందె నీరు

ఈ పథకం ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పర్యవేక్షణలో నడుస్తోంది. ముందుగా గ్రామాల్లో కుటుంబానికి ఒక ప్రత్యేక కార్డును మంజూరు చేస్తారు. ఈ కేంద్రాల ద్వారా సరఫరా అయ్యే నీటిని రెండు రూపాయలకు బిందె కొనుగోలు చేసేలా మినీ ప్లాంటుకు ప్రత్యేక యంత్రం బిగించారు. అలా వచ్చే డబ్బుతోనే ప్లాంటు నిర్వహణ చేస్తారు. ఇదంతా బాగుంది. కానీ ఆచరణలోకే రాలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారింది. నిధులు వృథా అవుతున్నాయి. ప్రైవేటు వ్యాపారుల దగ్గర క్యాను రూ.20లకు కొనుగోలు చేస్తున్నారు. పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు.

పేదలకు మేలు :

ఎన్టీఆర్‌ సుజల పథకం పూర్తయితే పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతోంది. మండలంలో చాలా గ్రామాల్లో ఫ్లోరిన్‌ నీరు తాగాల్సి వస్తోంది. 90 శాతం ఆరోగ్య సమస్యలు నీటి వల్లే వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. శుద్ధి జలాలు తక్కువ ధరకే పేదలకు అందించగలితే ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది.- సురేష్‌, మర్రిపాడు

త్వరలో వినియోగంలోకి :

శుద్ధి జల కేంద్రాన్ని తర్వలోనే వినియోగంలోకి తీసుకొస్తాం. మినీ ప్లాంట్లకు విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఐదు నెలల క్రితం ప్రతిపాదనలు పంపాం. వారు సహకరించకపోవడంతో ఆలస్యం అవుతోంది. విద్యుత్తు సరఫరా పూర్తయితే శుద్ధి జలం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.- రవితేజ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, మర్రిపాడు

ఇదీ చదవండి:

పదవి ఆమెది... పెత్తనం ఆయనది.. ఎమ్మెల్యే అయినా ప్రశ్నించలేరా?

ABOUT THE AUTHOR

...view details