నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర 22 వరోజుకు చేరుకుంది. నిన్న రాత్రి కావలిలో బస చేసిన రైతులు నేడు చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. చర్చి పోస్టర్స్ ఎన్ఎస్ సల్మాన్, రెవరెండ్ టి హేబెలూ.. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని యాత్ర విజయవంతం కావాలని రైతులను దీవించారు. కావలిలో కులసంఘాలు, ప్రజా సంఘాలు, విశ్రాంత ఉద్యోగులు, వాకర్స్ క్లబ్... రైతుల యాత్రకు సంఘీభావంగా తరలి వచ్చారు. ముసునూరు ప్రజలు రైతుల మహా పాదయాత్రకు స్వాగతం పలికారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన పలు పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యాత్ర చేస్తున్న వారిపై పలువురు నాయకులు, రైతులు, యువకులు పూల వర్షం కురిపించారు. వీరికి మద్దతు పలికేందుకు పలు ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు ఆటోల ద్వారా తరలివచ్చారు. నేడు బిట్రగుంట వరకు 13 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది.
21 వ రోజూ ఉధృతంగా సాగిన యాత్ర...
అమరావతి రైతుల మహాపాదయాత్ర 21వ రోజు జైత్రయాత్రలా(21st day Amravati Farmers Maha Padayatra ) సాగింది. నెల్లూరు జిల్లా రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన యాత్రకు.. స్థానికులు అడుగడుగునా హారతులు పట్టి నీరాజనాలు పలికారు. జై అమరావతి నినాదాలతో మహాపాదయాత్ర చలంచర్ల మీదుగా సాగింది. యాత్రలో వెంకటేశ్వరస్వామి రథంతో పాటు.. అల్లా, జీసస్‌కు సంబంధించిన వాహనాల ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఏకైక రాజధానిగా అమరావతినే కోరుకుంటున్నారని రైతులు తెలిపారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకున్నట్లే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.