Amaravathi farmers padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర 32వ రోజు కొనసాగుతోంది. ఇవాళ నెల్లూరులోని మరుపల్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. రైతుల పాదయాత్ర ఇవాళ 14 కిలోమీటర్ల మేర సాగనుంది. రైతులు తుమ్మలతలుపులు వద్ద మధ్యాహ్న భోజనం చేయనున్నారు. తురిమెర్ల వద్ద మహాపాదయాత్ర ముగియనుంది.
రోడ్డుపైనే భోజనాలు..
నిన్న (31వ రోజు) అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకుల మధ్య రైతుల పాదయాత్ర సాగింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వంట వండుకునేందుకు, బస చేసేందుకు చిన్న చోటు కూడా దొరకలేదు. సాయం చేద్దామని ముందుకొచ్చిన వారు కూడా.. వైకాపా నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారని సమాచారం. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంతూరు తోడేరు సమీపంలో రోడ్డుపైనే భోజనం చేసిన రైతులు, మహిళలు.. న్యాయం కోసం గొంతెత్తితే ఇబ్బంది పెట్టడం సరికాదంటూ కన్నీరుమున్నీరయ్యారు.
ఏడుస్తూ భోజనాలు..
పొదలకూరు సమీపంలోని వేబ్రిడ్జ్ దగ్గర భోజన ఏర్పాట్లు చేసుకున్న రైతులను కాటా నిర్వాహకులు తొలుత అనుమతించారు. అయితే.. చివరి నిమిషంలో మాట మార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక ఓ రైతుకు చెందిన నివేశన స్థలంలో అన్నం వండుకున్నా.. అక్కడ తగినంత స్థలం లేక చాటగొట్ల వద్ద రోడ్డుపైన కూర్చొని మహిళలు భోజనం చేశారు. వాహనాల దుమ్ము, మురుగు వాసన మధ్య భోజనం చేస్తున్నతం సేపు ఏడుస్తూనే ఉన్నారు. అమరావతి రైతుల యాత్ర భగ్నానికి కొందరు ప్రయత్నిస్తుంటే.. ప్రజలు మాత్రం ఘనస్వాగతం పలుకుతున్నారని ఐకాస నేతలు అన్నారు. తమను అడ్డుకోవడంపై పెట్టే శ్రద్ధ పాలనపై పెడితే బాగుంటుందని అధికార పార్టీకి సూచించారు.
రాజధాని రైతుల మహాపాదయాత్ర 32వరోజు.. వివిధ రాజకీయ పక్షాలతోపాటు కులసంఘాలు, వృత్తిసంఘాలు పెద్ద ఎత్తున మద్దతు పలికాయి. నిన్న రైతులకు భోజనం చేసేందుకు చోటు దొరక్క ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో.. వారికి సంఘీభావంగా స్థానికులు పెద్ద ఎత్తున పాదయాత్రలో కలిసి నడిచారు. తెదేపాతోపాటు భాజపా, సీపీఐ నేతలు పాదయాత్రలో నడిచారు. నెల్లూరు జిల్లా గౌడ సంఘం నేతలు, ముస్లిం మైనార్టీలు పాదయాత్రలో పాల్గొని.. ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. రైతుల దుస్థితి చూసి వైకాపాను వీడి వచ్చానంటూ ఓ స్థానికనేత రైతులతో కలిసినడిచారు.