ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కందుకూరు విషాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య - seven activists died in tdp meeting

1
1

By

Published : Dec 28, 2022, 8:07 PM IST

Updated : Dec 28, 2022, 11:04 PM IST

20:00 December 28

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ఆర్థికసాయం: చంద్రబాబు

కందుకూరు విషాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు పర్యటనలో విషాదం జరిగింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కందుకూరులో చంద్రబాబు రోడ్‌షో, బహిరంగసభ తలపెట్టారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతోపాటు స్థానికులు భారీగా తరలివచ్చారు. జనసందోహం తరలిరావడంతో ఒక దశలో నిలబడటానికి రోడ్లు, వీధులు సరిపడలేదు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి పరిస్థితి అదుపుతప్పింది. కొందరు రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడిపోయారు. కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

బహిరంగ సభలో ఉన్న చంద్రబాబు విషయం తెలుసుకుని డ్రైనేజీ కాలువలో పడ్డవారికి సహాయం చేయాలని పోలీసులు, తెలుగుదేశం వాలంటీర్లు, కార్యకర్తలను కోరారు. డ్రైనేజీలో పడ్డవారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించివారిలో 8మంది చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతులు గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం వాసి చినకొండయ్య, గుళ్లపాలెం వాసి పురుషోత్తం, గుర్రంవారిపాలెం వాసి కాకుమాని రాజా, ఉలవపాడు మండలం ఆత్మకూరు వాసి దేవినేని రవీంద్రబాబు, ఒరుగుసేనుపాలెం వాసి యాటగిరి విజయ, కందుకూరు వాసి ఈదుమూరి రాజేశ్వరి, కొండముడుసు వాసి కలవకూరి యానాది, ఓగూరు వాసి గడ్డ మధుబాబులుగా గుర్తించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారికి చికిత్స కొనసాగుతోంది.

బహిరంగ సభ నుంచి స్వయంగా ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు బాధితులను పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరఫున మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్‌ ట్రస్టు విద్యా సంస్థల్లో చదివిస్తామని తెలిపారు.

కందుకూరు ఘటనపై నారా లోకేశ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు అని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన నారా లోకేశ్‌.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Last Updated : Dec 28, 2022, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details