నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలికను 50 ఏళ్ల వృద్ధుడు చట్టవ్యతిరేకంగా వివాహం చేసుకొని లైంగిక దాడికి పాల్పడినట్లు నెల్లూరు దిశ పోలీస్స్టేషన్ డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు.
'నెల్లూరు నగరం కొత్తూరుకు చెందిన చిన్న సుబ్బయ్య.. ఇసుకపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం విడవలూరు మండలం దంపూరు గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ లైంగిక దాడికి పాల్పడగా.. భయాందోళనకు గురైన ఆ బాలిక.. కేకలు పెట్టడంతో గమనించిన స్థానికులు బాలికను రక్షించారు. సమాచారం అందగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని.. బాధితురాలిని ఐసీడీఎస్ హోంకు తరలించారు. నిందితునిపై కేసు నమోదు చేశాం' -నాగరాజు, డీఎస్పీ
మూడు రోజుల క్రితం జరిగిన వివాహ ఘటనపై ఫోక్సో చట్టం కింద దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు చిన్న సుబ్బయ్య కోసం మూడు బృందాలతో గాలిస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.