ముంచిన వాన.. 14 మంది మృతి అనుకోని వాతావరణ మార్పులతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి జోరు వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. దగదర్తిలో పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెల కాపరులు మరణించారు. నాయుడుపేట మండలం పూడేరు, గొట్టిపోలులో ఇద్దరు, అల్లూరులో ఒకరు, బోగోలులో మరొకరు పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు. వాన జోరుతో నెల్లూరు, నాయుడుపేట, ఉదయగిరిలో ప్రధాన రహదారులు, వీధులన్నీ జలమయమయ్యాయి. వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల్లో నూర్పిడి చేసిన ధాన్యపు రాశులు వర్షపు నీటికి తడిసి ముద్దయ్యాయి. సంగం, ఉదయగిరి ప్రాంతాల్లో మామిడి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. వాకాడు మండలంలో పెసర, పుచ్చ పంటలు నాశనమయ్యాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ, మోపిదేవి, కోడూరు, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో వర్షం పడింది. ఈదురుగాలులకు పడవలు ముక్కలై... కృత్తివెన్ను మండలానికి చెందిన నలుగురు చనిపోయారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఆరుబయట ఆరబెట్టిన పసుపు కొమ్ములు, మొక్కజొన్న గింజలు నీటిపాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మోపిదేవి మండలం చిరువోలులో పిడుగుపాటుకు గడ్డివాము దగ్ధమైంది. గుంటూరు జిల్లా రేపల్లె మండలం గంగిడిపాలేనికి చెందిన ఓ రైతు... పిడుగుపడి మృతి చెందాడు. నగరం మండలం పెద్దపల్లి రైతు... పొలంలో పంటపై పట్టలు కప్పుతుండగా పిడుగుపాటుకు గురై చనిపోయాడు. చేబ్రోలు మండలంలోని పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అల్లాడిపోయారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో పిడుగుపాటుకు ఓ రైతు మరణించాడు. చీరాల, పర్చూరు, అద్దంకి, పొదిలి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. కడప జిల్లా చిట్వేలు మండలం తిరుమలశెట్టిపల్లెలో ఈదురు గాలుల ధాటికి అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో ఉద్యానతోటలు భారీగా దెబ్బతిన్నాయి. తిరుపతిలో గంటపాటు గాలి వాన ప్రతాపం చూపింది. ప్రధాన రహదారులు, వీధులన్నీ జలమయమయ్యాయి. తిరుపతిలో ఈదురుగాలులకు ఇస్కాన్ మైదానం, బొంతాలమ్మ గుడి, నెహ్రూమున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజార్ షెడ్లు పూర్తిగా.. ఎస్వీ, ఎంజీఎం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన షెడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
అకాల వర్షాలు ఉభయగోదావరి జిల్లాలకు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయి. మామిడి, జీడిమామిడి, అరటి, మొక్కజొన్న సహా పలు పంటలను వానలు నిండా ముంచేశాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం, పోలవరం, గోపాలపురం, కొవ్వూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మొక్కజొన్న నేలరాలాయి. జంగారెడ్డిగూడెం పరిధిలో వెయ్యి హెక్టార్లలో మామిడి కాయలు నేలరాలాయి. 500 హెక్టార్లలో అరటి... నేలకూలింది. మొక్కజొన్న, వడ్లు పొలాల్లోనే తడిసిముద్దయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షాలకు ప్రజలు ఇబ్బందిపడ్డారు. రబీ వరి కోతలు జరుగుతున్న సమయంలో కురిసిన వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో భారీ వర్షాలు