నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పూలనీళ్లపల్లి గ్రామానికి చెందిన గర్భిణి సుభాషిణికి పురిటి నొప్పులు రావటంతో 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి పైలెట్ జమీర్ చేరుకున్నారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి.
సిబ్బంది అప్పటికప్పుడు స్పందించి.. మహిళకు ప్రసవం చేశారు. సుభాషిణి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లిని బిడ్డను క్షేమంగా నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. చాకచక్యంగా ప్రసవం చేయించి తల్లీబిడ్డను కాపాడిన 108 సిబ్బంది ఈఎంటీ రమేష్, పైలెట్ జమీర్‌ను సుభాషిణి బంధువులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది అభినందించారు.