పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ గ్రామాలు తరతరాలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతూనే ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని వాడపుట్టి, జోగిపురం, చినరావికోన, వల్లాడ, ఎగువచోడిపల్లి, గణపాక గిరిజనులకు నేలబావులే ఆధారం. పాచిపెంట మండలంలోని బొర్రమామిడి, తంగలాం, కర్రివలస గ్రామాలకు ఊటనీరే దిక్కు. బిందెడు నీటి కోసం గిరిజన మహిళలు చంకలో పిల్లలతో కొండలు, గుట్టలు, కారడవిలో గంటల తరబడి కిలోమీటర్ల మేర నడక సాగించాల్సిన దుస్థితి.
కర్రివలస పంచాయతీ మూలవలస గిరిజన గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు ట్యాంకు నిర్మాణం చేపట్టారు. అయితే పైపులైన్లు, మోటార్ ఏర్పాటులో ఆలసత్వం వల్ల ఇక్కడ నివసించే వందలాది కుటుంబాలు నీటి చెలమల నుంచే తాగునీటిని సేకరిస్తున్నాయి. గంటల తరబడి పడిగాపులు కాస్తేనే ఊటనీరు దొరుకుతోంది. ఎండలు ముదిరితే...ఈ నీరు కూడా లభించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.