ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sugar Factory: పనిచేసిన చేతులకు పట్టెడన్నానికి దూరం చేస్తారా! పార్వతీపురం చక్కెర కర్మాగారం కార్మికుల ఆవేదన

NCS Sugar Factory Workers Problems: ఉమ్మడి విజయనగరంలో జిల్లాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం. 17 మండలాల పరిధిలో వేలాది మంది రైతుల జీవనాధారంగా నిలచింది ఆ సంస్థ. వందలాది మంది కార్మికులు తలెత్తుకుని గర్వంగా పనిచేసిన చోటు అది. కాలక్రమంలో ఆ సంస్థ నష్టాలబాట పట్టింది. రైతులకు చెల్లింపులు, కార్మికులకు జీతాలు నిలిచిపోయాయి. కర్మాగారం భూములమ్మి రైతుల బకాయిలు చెల్లించినా.. కార్మికులకు మాత్రం న్యాయం జరగలేదు. ఉపాధి లేక, బకాయిలు రాక రోడ్డున పడ్డామని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని కోరుతున్నారు.

NCS Sugar Factory Workers Problems
షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు

By

Published : Apr 16, 2023, 11:06 AM IST

NCS Sugar Factory Workers Problems: ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రైవేటు రంగంలోనే అతిపెద్దది. ఈ కర్మాగారం పరిధిలో 17మండలాలకు చెందిన 15వేల మంది రైతులు చెరకు సాగు చేసేవారు. ప్రతి సీజన్‌లో రైతులకు చెల్లింపులు సజావుగా సాగేవి. సాగు పెంపు కోసం రైతులకు ప్రోత్సాహకాలూ అందించారు.

2012 నుంచి బకాయిలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019 నాటికి 23 కోట్ల రూపాయల చెల్లింపులు నిలిచిపోయి, రైతులు పెద్దఎత్తున ఉద్యమించారు. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకున్న ప్రభుత్వం.. రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేసింది. కర్మాగారానికి ఎదురుగా ఉన్న 62 ఎకరాల భూమిని వేలం వేసి.. రైతులు, కార్మికుల బకాయిలు పూర్తిగా చెల్లించడంతో అప్పటికి పరిస్థితి సద్దుణిగింది.

ఆ తర్వాత మళ్లీ సమస్య మొదలైంది. 2019-20, 2020-21 సీజన్లలో బకాయిలు 16.33 కోట్లకు చేరాయి. ప్రభుత్వం మరోసారి సంస్థ ఆస్తులు విక్రయించి రైతుల బకాయిలు చెల్లించినా.. దశాబ్దాలుగా చక్కెర కర్మాగారాన్నే నమ్ముకున్న కార్మికులు మాత్రం రోడ్డున పడ్డారు. నష్టాలతో రెండేళ్లుగా కర్మాగారం మూతపడింది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులు కలిపి సుమారు 3 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించకపోవడంతో.. కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

రెండేళ్లుగా కర్మాగారం మూతపడటంతో.. కార్మికులు ఉపాధి కోల్పోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో పలుగు, పార పట్టి కర్మాగారం ఆవరణలోనే తోట పని చేస్తున్నారు. 15 మంది వరకు కార్మికులు మృతి చెందగా.. వారి కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వారిని గుర్తుచేసుకుని, తమ కుటుంబాల భవిష్యత్‌ తలుచుకుని మిగిలిన కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

కార్మికుల ఆవేదనను ఇటీవల జిల్లా పరిషత్‌ సమాశంలో బొబ్బిలి ఎమ్మెల్యే చినఅప్పలనాయుడు ప్రస్తావించగా.. ఈ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందని కలెక్టర్‌ తెలిపారు. చక్కెర కర్మాగారాన్నే నమ్ముకుని చాలా ఏళ్లుగా బతుకీడ్చిన 300 మంది కార్మికులు, వారి కుటుంబాలు.. తమకు ఏదో ఒక దారి చూపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.

"మా కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎండీ నాగేశ్వరరావు గారు లాభాలు వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకొని.. నష్టాల సమయంలో కార్మికులకు, రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఈ ఫ్యాక్టరీని తయారుచేశారు. ఫ్యాక్టరీ లేక.. పీఎఫ్ డబ్బుల రాక.. కొంత మంది కార్మికులు మనోవేదనకు గురై చనిపోయారు". - రామ్మోహనరావు, కార్మికుడు

"నేను 29వ తేదీన రిటైర్ అయి.. ఇంటికి వెళ్లిపోతున్నాను. కానీ నాకు మేనేజ్​మెంట్ 2019 నుంచి పీఎఫ్ బకాయిలు, ఏం ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టింది. ఎంతో మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు". - గంగరాజు, కార్మికుడు

రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలు.. దారి చూపాలంటూ కార్మికుల ఆవేదన


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details