QR code on leaflet govt College campaign: పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు కృషి చేస్తున్నారు. అడ్మిషన్లు పెంచడానికి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ.. విద్యార్థులను కలిసి తమ కళాశాలలో చేరాలని కోరుతున్నారు. కళాశాల చరిత్ర, గొప్పదనం, వసతులు తదితర వివరాలు తెలిసేలా కరపత్రాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను 1969 సంవత్సరంలో స్థాపించారు. 54 వసంతాలు పూర్తి చేసుకుని ఉత్తరాంధ్రలో ప్రవేశాల్లో కూడా పెద్ద కళాశాలగా తన స్థానాన్ని ఏటా పదిల పరుచుకుంటోందీ కళాశాల. అక్కడ అధ్యాపకులు విద్యా బోధనతో పాటు కళాశాల ప్రవేశాలు పెంచేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో 2023- 24 విద్యా సంవత్సరానికి గాను అత్యధిక ప్రవేశాలు పొందేందుకు ప్రచారం ముమ్మరం చేశారు.
కరపత్రాలను ముద్రించి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న పదో తరగతి కేంద్రాలకు వెళ్లి విద్యార్థులకు వాటిని అందజేస్తూ.. తమ కళాశాల పట్ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతికతతో కళాశాల ప్రిన్సిపల్ రాజు ఆలోచన చేసి కరపత్రంపై క్యూఆర్ కోడ్ నమోదు చేశారు. దాని ద్వారా కళాశాలలో సౌకర్యాలు అమలు చేస్తున్న గ్రూపులు తదితర అంశాలను పొందుపరిచారు.