Chandrababu Visited Thotapalli Project: రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరాన్ని సీఎం జగన్ పొడిచేసి.. ఆంధ్రప్రదేశ్‌ను.. అంధప్రదేశ్‌గా మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రహదారిలో.. గుంత పడితే మట్టి వేయలేని సీఎం.. 3 రాజధానులేం కడతారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధికి తన సేవలు అవసరమో లేదో గుర్తించి కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశాన్ని గెలిపించాలన్నారు. ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి.. ఆ ప్రాంత రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.
వైసీపీ ఆరిపోయే దీపమని.. ఎక్కువ రోజులు ఉండదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా 9వ రోజు.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆయన పర్యటించారు. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో చంద్రబాబుకు అడుగడుగునా పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయన.. పార్వతీపురం బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోజగన్ అరాచకాలను భరించే స్థితిలో రాష్ట్రం లేదన్నారు. మన రాజధాని అమరావతేనంటూ.. ప్రజలతో గట్టిగా నినదింపచేశారు.
Chandrababu Selfie Challenge at Thotapalli Project: అంతకుముందు కురుపాం నియోజవర్గంలోని సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజీని చంద్రబాబు పరిశీలించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా.. గోదావరి నీళ్లు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపితే.. కరవు ఉండదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో13 ప్రాజెక్టులను వైసీపీ నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత.. రైతులతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. తోటపల్లి ద్వారా లక్షా 80వేల ఎకరాలకు నీరు పారాల్సి ఉండగా.. కాల్వలు మరమ్మతులు చేయించకపోవడంతో భూములకు నీరందడంలేదని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ వద్ద.. చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.