ఈ కోర్సు చదవండి..! మీ వైవాహిక బంధాన్ని హ్యాపీగా ఉంచుకోండి..! - ఆంధ్ర తాజా వార్తలు
Marriage Life Special Course: భార్యభర్తల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించుకోవాలను కుంటున్నారా.. మీ వివాహ బంధాన్ని హ్యాపీగా ఉంచుకోవాలనుకుంటున్నారా.. అయితే వెంటనే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లండి. భార్యభర్తల మధ్య సఖ్యతను వారే పెంచుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి సంప్రదించి.. మీ వివాహ దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపండి.!
Marriage Life Special Course
By
Published : Jan 22, 2023, 4:21 PM IST
|
Updated : Jan 22, 2023, 4:56 PM IST
Family Wellness Centre In Hyderabad: దిల్లీకి చెందిన 20ఏళ్ల యువకుడి తల్లిదండ్రులు.. విభేదాలతో అతని చిన్నప్పుడే విడిపోయారు. ఆ ప్రభావం కుమారుడిపై పడింది. అతను వివాహ బంధంపై నమ్మకం కోల్పోయాడు. తెలిసిన వారి సూచనతో ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్‌లో కొన్ని సెషన్ల కోర్సు చేశాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మెహదీపట్నానికి చెందిన భార్యాభర్తల్లో భార్య ఉద్యోగం చేస్తుండగా, భర్త ఇంట్లోనే ఉంటున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోవాలనుకున్నారు. చివరి ప్రయత్నంగా బంధువులు ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్‌కు తీసుకువెళ్లగా.. అక్కడ కోర్సులో ఐదు సెషన్లకు హాజరయ్యారు. అనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకుని కలిసి జీవిస్తున్నారు.
పెళ్లంటే ఏమిటి..? ఎందుకా బంధం..?భార్యాభర్తల మధ్య ఎలాంటి అవగాహన ఉండాలి..? ఇలా ఎన్నో ప్రశ్నలు కాబోయే దంపతులకు ఎదురవుతుంటాయి. పెళ్లయినవారిలోనూ ఆయా అంశాలపై అవగాహన లేక పొరపొచ్చాలు వచ్చి విడిపోతుంటారు. ఇలాంటివారికి వివాహ బంధంపై శిక్షణ ఇస్తూ.. యువతీయువకుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా అవగాహన కల్పిస్తోంది ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్. హైదరాబాద్‌లోని టోలీచౌకీకి చెందిన మహ్మద్ ఇలియాస్ 20 ఏళ్ల పాటు ఫ్యామిలీ కౌన్సెలర్‌గా పనిచేశారు.
న్యాయ స్థానాలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా కౌన్సెలింగ్, సలహాల వంటివాటిపై దృష్టిపెట్టినా భార్యాభర్తల మధ్య పరిస్థితులు అంతగా మెరుగుపడటం లేదని గమనించారు. తర్వాత టోలీచౌకిలో ఫ్యామిలీ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేశారు. పెళ్లికి ముందు, తర్వాత నేర్చుకునేందుకు వీలుగా ‘దుల్హ, దుల్హన్’ కోర్సు నిర్వహిస్తున్నారు. 2017లో సంస్థను ప్రారంభించగా రెండేళ్లు ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించారు. తర్వాత కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1500 మంది కోర్సు చేశారు.
భార్యాభర్తల మధ్య విభేదాలకు కారణాలు:
ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే అహం ఉండటం
ఇద్దరూ సంపాదించే క్రమంలో ఆర్థిక నిర్వహణ లేకపోవడం
భార్య సంపాదిస్తుంటే భర్త ఇంట్లో ఉండటంతో గొడవలు
ఆర్థిక ఇబ్బందులతో ఒకరినొకరు నిందించుకోవడం
వరకట్న వేధింపులు
అత్తమామలతో వివాదాలు
ఇంటి పనుల్లో పరస్పర సహకారం లేకపోవడం
15 అంశాలు.. 22 సెషన్లు: ఫ్యామిలీ కౌన్సెలర్‌గా పనిచేసిన అనుభవంతో పాటు వివిధ పుస్తకాలు చదివి సిలబస్‌కు ఇలియాస్ రూపకల్పన చేశారు. 15 అంశాలపై 22 గంటల వ్యవధి ఉండే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రొజెక్టర్, పీపీటీ సాయంతో వివరిస్తుంటారు. కోర్సు పూర్తయ్యాక ఏవైనా సందేహాలుంటే మరో 10 సెషన్ల పాటు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. వివిధ దేశాల వారూ ఈ కోర్సు చదువుతున్నారు. రూ.5000 ఫీజుగా నిర్ణయించినా.. కొందరు తక్కువ ఇచ్చినా తీసుకుంటున్నా అని మహమ్మద్ఇలియాస్ పేర్కొన్నారు. మూడు,నాలుగు నెలలుగా బ్యాచ్‌లు నిర్వహించడం లేదని.. మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్నా’’ అని ఆయన చెప్పారు.