Gold Chain Theft In Palakonda : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ముదునూరి వారి వీధిలో జరిగిన బంగారు గొలుసు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పాలకొండ మండలం ఎన్‌కే రాజపురం గ్రామానికి చెందిన మెంతి మణికంఠ దొంగతనానికి పాల్పడినట్లు డీఎస్పీ క్రిష్ణారావు తెలిపారు. నిందితుడు నుంచి 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లగా పాలకొండ సీఐ అధ్వర్యంలో టీమ్లు ఏర్పాటు చేసి కేసును ఛేదించామన్నారు.
ఐదు బృందాలతో గాలింపు :ఏలం కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మణికంఠను ఎస్సై, ప్రత్యేక బృందం సభ్యులు పట్టుకొని విచారించగా తప్పు ఒప్పుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదించేందుకు ఎస్పీ ఆదేశాలతో 5 బృందాలను నియమించామని అన్నారు. సీసీ టీవీ పుటేజి, క్రిమినల్ కేసు బృందం విచారణ కీలకంగా మారాయని అన్నారు. నిందితుడు కాజేసిన నాలుగు తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ చోరీని ఛేదించడంలో కృషి చేసిన హోం గార్డ్ రమేష్, పీసీ రాజేష్, ఏఎస్ఐ శంకర్ రావు, సీసీఎస్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దామోదర్ రావులను డీఎస్పీ క్రిష్ణా రావు అభినందనలు తెలియజేశారు.