People Face Problems due to No Bridge: ఆమె మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో పనిచేశారు. సీఎం జగన్‌ని పొగడ్తలతో ముంచెత్తడానికి ముందుంటారు. సామాజిక మాధ్యమాల్లోనూ వీడియోలు పెట్టి సందడి చేస్తూ ఉంటారు. కానీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం సమస్యలపై మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వంతెన కోసం ఏళ్ల తరబడి కొన్ని గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. పాలకులతో పని కాదనుకున్న ఆ పంచాయతీ ప్రజలు.. తలో చేయి వేసి.. స్వయంగా వారే చిన్న సైజు వంతెన నిర్మించుకుంటున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గొటివాడ పంచాయతీ ప్రజలకు తరతరాలుగా వంతెన కష్టం తీరడం లేదు. గొటివాడ నుంచి బోరి బండిగూడ, బల్లేరు, బోరుగూడ, కిడికేసు, బల్లేరుగూడ, నిడగల్లుగూడ గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే మధ్యలో ఉన్న గెడ్డ దాటాల్సిందే. వంతెన లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. వర్షాకాలం వస్తే పరిస్థితి మరీ దయనీయం. ప్రమాదకరంగా భావించే గెడ్డ దాటలేక.. చుట్టూ 13 కిలో మీటర్ల దూరం తిరిగి జియ్యమ్మవలస మండలంలోని రామభద్రపురం గ్రామం మీదుగా వెళ్తున్నారు.
అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక గ్రామస్థులు, యువకులు కలిసి శ్రమదానం చేసి గత ఏడాది వర్షాకాలంలో కర్రలతో గెడ్డపై సొంతంగా వంతెన నిర్మించారు. దీంతో బడికి వెళ్లే పిల్లలకు, ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. తాత్కాలికంగా నిర్మించుకున్న కర్రల వంతెన ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన గ్రామస్థులు.. ప్రభుత్వం వంతెన నిర్మాణానికి చొరవ చూపకపోవడంతో వారే మళ్లీ ముందడుగు వేశారు. పంచాయతిలో ప్రతి ఇంటికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున డబ్బులు సేకరించి.. గెడ్డపై తాత్కాలికంగా దాటేందుకు ఇనుప వంతెన ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి గెడ్డపై వంతెన ఏర్పాటు చేస్తామంటూ ఘనంగా మాట ఇచ్చారు. అయితే ఆ మాటలు గాలికొదిలేసి.. నాలుగేళ్లైనా వంతెన సంగతి పట్టించుకోలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ యువనేత వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ గిరిజన గ్రామాలను సందర్శించి ప్రజలు పడుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వంతెన ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2020 ఫిబ్రవరిలో ఇక్కడ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా.. 80 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఐటీడీఏ పర్యవేక్షక ఇంజినీరులు తెలిపారు. కానీ నిర్మాణానికి నిధులు చాలకపోవడంతో పనులు ప్రారంభించలేదన్నారు.