Water Problem: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో నాన్-అమృత్ పథకాన్ని మంజూరు చేసింది. నగరపంచాయతీ పరిధిలోని నాలుగు పథకాల విస్తరణతో పాటు.., ప్రధాన పైపులైన్ల నిర్మాణానికి రెండు ప్యాకేజీల్లో 57కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులు నత్తనడకను సాగుతున్నా...ఎవరూ పట్టించుకోవడం లేదు. దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే భారీ ప్రాజెక్ట్ పై నీలి నీడలు అలముకున్నాయి. అన్ని వార్డులను కలుపుతూ 60కిలోమీటర్ల మేరకు విస్తరణ పైపులైన్లు వేయాల్సి ఉంది. ఈ పనులను గుత్తేదారు గతేడాది నవంబరులో ప్రారంభించారు. 5.6కిలోమీటర్ల మేర మాత్రమే పైపులు వేశారంటే...., పనులు సాగుతున్న తీరును అర్ధం చేసుకోవచ్చు. నాగావళి నది నుంచి 5 కిలోమీటర్ల మేరకు ప్రధాన పైపులు వేయాల్సి ఉండగా.... ఆ పనులూ ప్రారంభంలోనే నిలిచిపోయాయి.
పాలకొండ ప్రజలకు తాగునీటి కోసం తిప్పలు తప్పటం లేదు. నాలుగు రక్షిత పథకాలున్నా ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందటం లేదు. ప్రస్తుత వేసవీలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు పథకాలు పురాతమైనవి. మరో రెండు తక్కువ పరిధికే పరిమితమైనందున అవస్థలు తప్పటం లేదు. కొత్తగా వేసిన పైపులైన్లు కాలువల్లో మురుగునీటిలోనే ఉన్నాయి. లీకుల వల్ల మురుగునీరు పైపులైన్లలోకి ప్రవేశించి తాగునీటి జలాలు కలుషితమవుతున్నాయి. ఆ నీటినే తాగి ప్రజలు తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. తాగునీటి పైపులైన్ల విస్తరణ కోసం ప్రస్తుతం 4 వార్డుల్లో 20వీధుల్లో పైపులను, సిమెంట్ రహదారులను ఇష్టానుసారంగా తవ్వేశారు. దీంతో కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేసిన తాగునీటి పైపులైన్ల విస్తరణ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పాలకొండ ప్రజలు కోరుతున్నారు.