One Plot Allotted Two Beneficiaries : పార్వతీపురంలో నవరత్నాల పథకంలో భాగంగా నిరుపేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు 17 జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. ఇందులో 2,853 మందికి ప్లాట్లను కేటాయించారు. కొన్ని లేఔట్లు నివాసయోగ్యానికి అనువుగా లేనందున ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ ఇళ్ల వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముందు వారు గోడు వెళ్లబోసుకోగా.. ఆయన రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాపైనే మరో కాలనీలో స్థలం కేటాయిస్తున్నట్లు రాసివ్వడమే గాక.. ప్లాట్ నెంబర్ వేసి మరీ సంతకం చేసి వారి చేతిలో పెట్టారు. ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతో ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇళ్లు నిర్మించుకోవడం ప్రారంభించారు. అప్పటికే ఆ స్థలం వేరొకరికి కేటాయించి ఉండటంతో.. వారు అక్కడికి వచ్చి లబోదిబోమంటున్నారు. ఒకే స్థలాన్ని ఇద్దరికి ఎలా కేటాయిస్తారంటూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.
"మాకు జగనన్న కాలనీలో స్థలం కేటాయించారు. మాకు కేటాయించిన స్థలంలో వేరే వాళ్లు అక్రమంగా నిర్మాణం చేపట్టారు. మాకు అధికారులు ఫోన్ చేసి మీ స్థలం చూపిస్తాము రమ్మని అంటే వచ్చాము. మా స్థలంలో జరిగిన నిర్మాణాలకు డబ్బులు చెల్లిస్తామని అన్నాము. అయిన ఇంకా పరిష్కారం కావటం లేదు." -బాధితురాలు
స్పందన కార్యక్రమంలో ప్రతివారం ఇలాంటి ఫిర్యాదులు పెద్దఎత్తున వస్తుండటంతో.. కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఎవరికైతే స్థలం కేటాయించిందో వారిదే ఆ స్థలమని తేల్చి చెప్పారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే కట్టుకోవాలని ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కలెక్టర్ ఆదేశాలు అమలుకావడం లేదు. ఇప్పటికే ఆయా స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు ఖాళీ చేయడం లేదు. దీంతో ఇరువర్గాలు ఘర్షణపడుతున్నాయి.
"మాకు ఎమ్మెల్యే పట్టాలు ఇచ్చారు. ఖాళీగా ఉన్న దగ్గర ఇళ్లు నిర్మించుకొమని ఓ స్థలం చూపించారు. అక్కడ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాము. తర్వాత వేరే వాళ్లు వచ్చి ఇది మాకు కేటాయించిన స్థలమని అన్నారు. అందువల్ల మేము నిర్మించిన కట్టడాలకు వారు నగదు చెల్లిస్తామని అన్నారు." -బాధితురాలు