UTF District Council meeting: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం లైన్స్ కల్యాణ మండపంలో యుటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ మూడు నెలల పాలనలో పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయని.. ఆయన అన్నారు. అందుకు సంబంధించిన జీవో 117ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీన ప్రక్రియ మానుకోవాలన్నారు. ఉపాధ్యాయ పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పి.. ఇప్పుడు గ్యారంటీ పింఛన్ ఇస్తామంటున్నారని అది ఆమోదయోగ్యం కాదని అన్నారు. మీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు.
2021లో ఇచ్చిన డీఏ ఇప్పటికి అమలు చేయలేదని దానికి గ్యారెంటీ లేనప్పుడు.. గ్యారెంటీ పింఛన్ విధానం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు డీఏలు, పీఎఫ్‌లు, ఏపీజీఐలు, సరెండర్ లీవ్‌లు ఏమీ అమలు చేయడం లేదని అన్నారు. ఒకటో తేదీకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని చెప్పి కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా తీయలేదని విమర్శిచారు. వివిధ పథకాల అమలు చేస్తూ ఉపాధ్యాయులచే పాఠాలు బోధించకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఉన్నత అధికారులను ప్రయోగించి ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని.. ఉపాధ్యాయులను దొంగల్లా చూస్తున్నారని అన్నారు.