Dangerous Mining Activities in Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని చినగుడబ, పెదగుడబ, కొంకడివరం పంచాయతీల్లో జరుగుతున్న మైనింగ్ పనులు ప్రమాదకరంగా సాగుతున్నాయి. పరిమితికి మించి తవ్వకాలు చేపడుతూ.. సంబంధిత మైనింగ్ యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రమాదకరంగా మైనింగ్ తవ్వకాలు ఇష్టారీతిన తవ్వకాలు: చినగుడబ, పెదగుడబ, కొంకడివరం, గదబవలస తదితర గ్రామాల్లోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే.. ప్రమాద తీవ్రత అధికంగా ఉంటుందని చుట్టుపక్కల గ్రామస్థులు భయపడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టకపోవడం వల్లే యాజమానులు ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నారని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంపై ప్రభావం: గ్రామానికి సమీపంలో ఓ మైనింగ్ కంపెనీ అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతోందని రైతులు తెలుపుతున్నారు. దీనివలన రహదారులపై రాకపోకలు చేసేవారు, గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఏ మాత్రం ఆదమరచినా సరే పెను ప్రమాదం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందని.. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు అంటున్నారు.
పంట పొలాలు, ఇళ్లకు తీవ్ర నష్టం: నిత్యం మైనింగ్ పనులు జరపడం వలన పంట పొలాలు, వివిధ రకాల తోటలు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు తెలిపారు. మైనింగ్ తవ్వకాలు.. లోతుకు వెళ్లిపోయినా సరే ఆపడం లేదని వాపోతున్నారు. దీని వలన భూగర్భ జలాలు కూడా పూర్తిగా తగ్గిపోతున్నాయని అంటున్నారు. మైనింగ్ చేస్తూ.. బ్లాస్ట్‌లు జరపడం వలన తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని అంటున్నారు.
అధికారుల చర్యలు శూన్యం: గతంలో కూడా గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగ సాగుతోన్న మైనింగ్ పనులు కారణంగా పలు ప్రమాదాలు జరిగాయని గ్రామస్థులు చెబుతున్నారు. పంట పొలాలకు, రహదారులకు, గ్రామానికి అతి సమీపంలో మైనింగ్ పనులు జరుగుతున్నా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజల ఆవేదన: ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా సాగుతోన్న ఈ మైనింగ్ పనులను నిలిపిపోయాలని.. తగు చర్యలు తీసుకోవాలని సమీప గ్రామ ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా మైనింగ్‌తో పాటు కొండ అంచుల్లోని మట్టిని భారీగా తవ్వి.. రియల్ ఎస్టేట్ భూములను చదును చేయడం కోసం తరలిస్తున్నారు. దీంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. వీటి వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: