Millet Awareness Program: ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులతో పాటు మనిషి ఆహారపు అలవాటులో తీవ్రమైన మార్పులు కారణంగా అనేక రుగ్మతలు దరి చేరుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి వ్యాధులు జనాలను పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కని ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఆవశ్యకత ఎంతో ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చిరుధాన్యాలపై యంత్రాంగం విస్తృత ప్రచారానికి నడుము కట్టింది. వివరాల్లోకి వెళ్తే..
పార్వతీపురం మన్యం జిల్లాలో చిరుధాన్యాల వినియోగం వాటి ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. అన్ని రంగాల్లో నెలకొన్న తీవ్ర పోటీ.. అందుకు తగ్గట్టుగా పరుగులు పెట్టే తీరు మారిన ఆహార అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా యువత ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయించటం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం తదితర కారణాలతో అనేక రుగ్మతలు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు పలకరిస్తున్నాయి.
వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు చిరుధాన్యాల ఆవశ్యకత ఎంతో ఉందని నిపుణులు వివరిస్తున్నారు. జిల్లాలో 12 గిరిజన మండలంలో వివిధ రకాల చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం మైదాన ప్రాంతీయులు సైతం రాగులు, జొన్నలు, ఊదలు, ఆరికలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో 20 శాతం మేర వినియోగించేవారు. ప్రస్తుతం అది 2 శాతానికి పడిపోయినట్టు నిపుణులు సూచిస్తున్నారు.
సాగు విస్తీర్ణం.. మైదాన ప్రాంతాల్లో గణనీయంగా తగ్గింది. ఆ పరిస్థితి చక్కదిద్దేందుకు వ్యవసాయ శాఖ.. అవగాహన కార్యక్రమం చేపడుతోంది. కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించి చిరుధాన్యాల సాగుపై, వినియోగంపై విస్తృత ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు చిరుధాన్యాల ప్రదర్శన ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
రేపటి పౌరులు అయిన విద్యార్థులు చిరుధాన్యాల ఆవశ్యకత గుర్తించేలా యంత్రాంగం చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. అక్కడ చిరుధాన్యంతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ప్రదర్శించారు. చిరుధాన్యాలతో అందమైన రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల ప్రాధాన్యత గుర్తిస్తున్నారని ప్రపంచ చిరుధాన్యాల దినం పాటించడం వెనుక భారతదేశం కృషి ఎంతో ఉందని అధికారులు పేర్కొన్నారు.