ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ ఇంజిన్‌లో మంటలు... డ్రైవర్‌ సజీవదహనం - మన్యనం జిల్లాలో లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్‌ సజీవదహనం

సజీవదహనం
సజీవదహనం

By

Published : Jun 18, 2022, 4:34 PM IST

Updated : Jun 19, 2022, 6:46 AM IST

16:31 June 18

మన్యం జిల్లా సాలూరు వద్ద ఘటన

మన్యం జిల్లాలో ఘోర ప్రమాదం నెలకొంది. సాలూరు వద్ద ఆగి ఉన్న లారీ ఇంజిన్​లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని లారీ డ్రైవర్ సజీవదహనమయ్యారు. పట్టణ ఎస్సై ఫకృద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యప్రదేశ్‌కు చెందిన డ్రైవర్‌ సోనూ (35) విజయవాడ నుంచి సిమెంటు లోడును మక్కువ తీసుకెళ్లాడు. అక్కడ కొంత సిమెంటు అన్‌లోడ్‌ చేశాడు. మిగిలినది జీగిరాంలో దించాలని సాలూరు మీదుగా వెళ్తుండగా ఇంధనం అయిపోవడంతో వాహనం నిలిచిపోయింది. ఇంజిన్‌లో గాలి చొరబడి మరమ్మతులకు గురవడంతో బాగు చేయాలని డ్రైవర్‌ తన యజమానికి ఫోన్‌చేసి తెలిపాడు. లారీ కంపెనీ నుంచి మెకానిక్స్‌ వస్తారని చెప్పడంతో గురు, శుక్రవారం ఇక్కడే ఉండి ఎదురుచూశాడు. శనివారం మధ్యాహ్నం యజమానికి మరోసారి ఫోన్‌ చేయగా వస్తున్నారని చెప్పారు. ఇంతలోనే ఏమైందో లారీలో పెద్ద మంటలు వ్యాపించి దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. లోపల నుంచి పొగలు వస్తున్నాయని తలుపులు తీసి చూశారు. అప్పటి వరకు లారీ మాత్రమే మంటల్లో చిక్కుకుందనుకున్న సిబ్బందికి లోపల సజీవ దహనమైన చోదకుడి మృతదేహం కనిపించింది. వంట చేసుకునేందుకు ఉంచిన గ్యాస్‌ సిలిండర్‌ కూడా పేలడంతో పెద్ద శబ్దం వచ్చిందని ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద కారణాలపై సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

రెండు రోజులుగా అవస్థలు..: లారీ మరమ్మతులకు గురి కావడం, డ్రైవర్‌ చరవాణి చోరీకి గురవడంతో చోదకుడు సోనూ సాలూరులో భాష తెలియక రెండు రోజులు నానా అవస్థలు పడ్డాడు. టీ తాగేందుకు, భోజనం చేసేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడని వాహనం నిలిపిన ప్రాంతంలోని మోటారు కార్మికులు తెలిపారు. స్థానికుల సహాయంతో చిన్న చరవాణి కొనుక్కుని కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడని, లారీని నడిపేందుకు రిపేరు చేసే ప్రయత్నంలో షార్ట్‌సర్క్యూట్‌ అయి అగ్నిప్రమాదానికి గురై మృతి చెంది ఉంటాడని వారు చెబుతున్నారు. ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా గేర్‌ రాడ్‌లో కాలు చిక్కుకుని ఉన్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. అంతేకాకుండా మంటలకు లోపల ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ప్రమాదం మరింత పెరిగింది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 19, 2022, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details