Bandaru Satyanarayana comments: రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల విధానాన్నే మార్చేశారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వచ్చిన ఆయన.. శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడున్నరేళ్లగా బెదిరింపు పాలన సాగుతోందన్నారు.
TDP Candidate for MLC Elections: ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వేపాడ చిరంజీవిరావు మాస్టర్‌ను నిలిపామని, ఆయన తమ పార్టీ కాకపోయినా విద్యావేత్త, మేధాని అని చంద్రబాబు నాయుడు ఆయన్ను నిలబెట్టారన్నారు. పార్టీలో చాలా మంది అర్హులున్నా శాసనసభలో నిరుద్యోగుల సమస్యలపై గలమెత్తే తత్వం, ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తయారు చేసేందుకు.. కోచింగ్ సెంటర్ పెట్టి శిక్షణ ఇస్తున్నటువంటి వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. ఓ మంచి వ్యక్తి, సరైన వ్యక్తిని పంపించాలనే చిరంజీవిరావును ఎంపిక చేశారన్నారు.
చిరంజీవిరావుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు మద్దతు ఇస్తున్నారన్నారు. నిరుద్యోగులకు చంద్రబాబునాయుడు హయాంలో నిరుద్యోగ భృతి ఇచ్చేవారని, ఉపాధ్యాయులకు గౌరవమైన ఫిట్ మెంట్ ఇచ్చారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులు తమకు నెల జీతం వస్తే చాలనే భావనలో ఉన్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమని.. అందుకే అవగాహన లేకుండా చట్టాలను తయారుచేస్తూ కోర్టు ద్వారా అనేక సార్లు మొట్టికాయలు తిన్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని అన్నారు.