Farmers Lost Their Vegetable Crops in Michaung Cyclone Effect: భూమాతను నమ్ముకొని ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల సంభవించిన మిగ్‌జాం తుపాను ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన కూరగాయల పంట సాగుదారులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వంకాయ, బెండ, క్యాబేజీ, చిక్కుడు, బీర తదితర పంటలను నష్టపోయి రైతులు అప్పుల పాలయ్యారు. అప్పు చేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టినా అతివృష్టి వల్ల పంటలు దెబ్బతినటంతో రైతులు ఆవేదన చెెెందుతున్నారు.
Crops Loss In Parvathipuram And Manyam District: పార్వతీపురం, మన్యం జిల్లాలో సుమారు 5వేల ఎకరాల్లో కూరగాయలు పంటలను రైతులు సాగు చేస్తున్నారు. క్యాబేజీ, బీర, వంగ, టమాటా, చిక్కుడుతో పాటు ఆకుకూరలు విరివిగా పండిస్తున్నారు. ఇటీవల సంభవించిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవకపోయినా ఎడతెరిపి లేకుండా మూడు రోజులు పాటు కురిసిన వర్షాలకు కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా కాలీఫ్లవర్ పువ్వులు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం కారణంగా తెగుళ్లు బారిన పడి నల్లగా మాడిపోయి పాడైపోతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిండా ముంచిన మిగ్‌జాం తుపాను - ఆందోళనలో రైతులు
Vegetable Crops Loss In Farmers: కాలీఫ్లవర్ పువ్వుపై నల్లని బూడిద రంగు ఏర్పడి క్రమేనా అది పూర్తిగా పాడవుతోంది. అలాగే వంకాయలు కూడా పిండి దశలోనే గడుసు వారిపోతున్నాయి. బెండకు తెగులు సోకటంతో కాయలకు రంధ్రాలు పడి ఎండిపోతున్నాయి. అదే విధంగా బీర, చిక్కుడు పాదులు నీటి దాటికి పూర్తిగా నాశనం అయ్యాయి. వేలాది రూపాయలు మదుపు పెట్టి పంట సాగు చేస్తే వర్షం దాటికి పంట నష్టంతో అప్పు తీర్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.