ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 23, 2022, 3:30 PM IST

ETV Bharat / state

చిల్లర దుకాణాలు.. పెట్రోల్​ బంకుల్లో దొంగ నోట్లు మారుస్తున్నారు!

Fake Currency: చిల్లర దుకాణాలు, పెట్రోల్ బంకులను లక్ష్యంగా చేసుకొని.. చాకచక్యంగా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం జిల్లా కొమరాడ పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ నోట్ల చెలామణి.. దంపతుల అరెస్టు
నకిలీ నోట్ల చెలామణి.. దంపతుల అరెస్టు

Fake Currency: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న దంపతులను పార్వతీపురం జిల్లా కొమరాడ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా వనపర్తికి చెందిన సత్య నాగమల్లేశ్వర రెడ్డి, వనజ భార్యభర్తలు. వీరు గత రెండేళ్లుగా పార్వతీపురంలో నివాసం ఉంటున్నారు. సత్య నాగమల్లేశ్వర రెడ్డి స్థానిక పెట్రోల్ బంక్​లో పని చేస్తున్నారు. ఈనెల 11న వీరు తమ బంధువల పెళ్లికి స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ బంధువు అనిల్ రెడ్డి నకిలీ నోట్ల విషయాన్ని సత్యనాగమల్లేశ్వర రెడ్డికి తెలియజేశాడు.

కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న దురాశతో అనిల్ వద్ద సత్యనాగమల్లేశ్వర రెడ్డి రూ.10 వేల అసలు నోట్లకు.. రూ.20 వేల నకిలీ నోట్లు తీసుకున్నారు. ఇటీవల బొబ్బిలిలో జరిగిన దాడితల్లి అమ్మవారి జాతరలో కొంత నకిలీ నగదును చలామణి చేశారు. మూడు రోజుల క్రితం రాయగఢ వెళ్లి తిరిగి వస్తూ.. మరికొంత నగదును చలామణి చేశారు. ఇవాళ కొమరాడలో పెట్రోల్ బంకులో రూ. 200 నకిలీ నోటు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు.

కాసేపటికి అది నకిలీ నోటు అని గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది.. పార్వతీపురం పాత బస్టాండు వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు భార్యభర్తలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.19 వందల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇంతకు ముందే పెద్ద ఎత్తున నకిలీ నోట్లను మార్కెట్​లో చెలామణి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ నోట్ల ముఠాను పట్టుకునేందుకు తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక బృందాన్ని పంపామని ఎస్సై ప్రయోగ మూర్తి తెలిపారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details