Bjp state President Somu Veeraju Comments: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పేర్లు మార్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలనను కొనసాగిస్తున్నారని.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం మహేందర్ జిల్లా పాలకొండలో నేడు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల పేర్లు మార్చి 'జగనన్న పేరు'తో ముఖ్యమంత్రి జగన్ తన పరిపాలనను సాగిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకు రూ. లక్ష ఎనభై వేలు అందిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 'జగనన్న కాలనీలు'గా పేరు పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటుందని ఆగ్రహించారు.
అనంతరం రాష్ట్రం ప్రభుత్నం 'నవరత్నాల' పేరిట తొమ్మిది పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం రైతులకు 10 పథకాలను అమలు చేస్తుందని.. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. కేంద్రం ప్రభుత్వం అందిస్తున్న నిధులను మళ్లించి.. రాష్ట్రం తమ ప్రయోజనాలకు వినియోగించుకుంటుందని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ వల్ల ఉత్తరాంధ్రకు మేలు కలుగుతుంది సోము వీర్రాజు పేర్కొన్నారు. కుటుంబ పాలన నడిపే రాజకీయ పార్టీలకు తమ పార్టీ దూరంగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.