రైతు జగనన్న స్టిక్కర్ తొలగిస్తున్న వీడియో Jagannana Sticker Removal: గ్రామ సమస్యలు పరిష్కరించిన తర్వాతే "మా నమ్మకం నువ్వే జగన్" స్టిక్కర్ అంటించాలని ఓ అభ్యుదయ రైతు తేల్చి చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వీఆర్ రాజుపేటకు చెందిన అభ్యుదయ రైతు కండ ప్రసాదరావు తమ ఇంటికి అంటించిన స్టిక్కర్‌ను తొలగించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే తమ ఇంటికి స్టిక్కర్ అంటించాలన్నారు.
ఇదీ జరిగింది.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలోని వీఆర్ రాజుపేట గ్రామంలో సోమవారం వైసీపీ నాయకులు 'జగనన్నే మా భవిష్యత్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికి సీఎం జగన్ ఉన్న 'మా నమ్మకం నువ్వే జగన్' అనే స్టిక్కర్‌ను అతికించారు. అయితే ఇలా తమ ఇంటికి అతికించిన ఆ స్టిక్కర్‌ను అభ్యుదయ రైతు కండ ప్రసాదరావు తొలగించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాలుగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని తెలిపారు. ఈ సమస్య వల్ల గ్రామస్థులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతోపాటు తోటపల్లి కాలువల ఆధునీకరణ ఏళ్లుగా కొనసాగుతుండటం వల్ల రైతులు సాగునీటి కోసం ఇబ్బందులకు గురవుతున్నరని పేర్కొన్నారు. ఇవి మాత్రమే కాక జలసిరి పథకం కింద తమ గ్రామంలో ఇప్పటికీ బోర్లు వేయలేదని ఆయన వాపోయారు. ఇలాంటి తమ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తే.. అప్పుడు తానంతట తానే ఆ స్టిక్కర్‌ను తన ఇంటికి అతికిస్తానని రైతు వెల్లడించారు.
" ఈ రోజు మా గ్రామంలో వైసీపీ నాయకులు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఇంటింటికి స్టిక్కర్లను అతికిస్తూ.. మా ఇంటికి కూడా అతికించారు. అయితే మా ఇంటికి స్టిక్కర్లను అతికించొద్దని, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయని నేను వైసీపీ నాయకులతో చెప్పాను. గత పదేళ్లుగా మా గ్రామంలో రోడ్డు పాడైపోయింది.. దాన్ని వేయించాలి. రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం.. మీ వెంట మేమూ వచ్చి.. జైలుకు కూడా వెళ్లి.. సంవత్సరం పాటు కోర్టుల చుట్టూ తిరిగాము. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి మా డిమాండ్స్ నెరవేరితే అప్పుడు నేనే స్వయంగా ఈ స్టిక్కర్‌ను అతికిస్తాను." - కండ ప్రసాదరావు, స్థానిక రైతు
ఇవీ చదవండి: