Macharla Incident Updates: రోడ్లపై బండ రాళ్లు, గాజుపెంకులు, తగలబడిన వాహనాలు, ధ్వంసమైన కార్లు, తెలుగుదేశం కార్యాలయంలో బూడిద కుప్పగా మారిన సామాగ్రి.. ఇవి పల్నాడు గడ్డ మాచర్లలో నేడు కనిపించిన దృశ్యాలు. రౌడీ మూకలు అడ్డూ అదుపు లేకుండా సాగించిన విధ్వంసానికి ఎటు చూసినా భయానక వాతావరణం కనిపించింది. వైసీపీ మూకల దాడిలో తెలుగుదేశం కార్యాలయం కాలి బూడిదైంది. మాచర్ల ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డి.. తన నివాసాన్నే పార్టీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. అందులోని ఫర్నీచర్, గృహోపకరణాలు, వంటసామాగ్రి అన్నీ అగ్నికీలల్లో కాలిపోయాయి. పార్టీ నాయకులకు చెందిన 12 వాహనాలు ధ్వంసమయ్యాయి.
ప్రస్తుతం మాచర్లను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఎక్కడ చూసినా వారే కనిపించారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి బలగాల్ని రప్పించారు. దాడులు జరిగిన ప్రాంతాలతో పాటు అన్ని ముఖ్య కూడళ్లు, పార్టీ కార్యాలయాల వద్ద బందోబస్తు పెట్టారు. ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతున్నందున.. పట్టణంలో హోటళ్లు , వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు కూడా నడపలేదు. ప్రయాణీకుల ఇబ్బందుల దృష్ట్యా పరిస్థితిని సమీక్షించి.. ఆ తర్వాత పాక్షికంగా సర్వీసులు పునరుద్ధరించారు.
గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. పట్టణంలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు దాడులకు సంబంధించి ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేదన్నారు. తామే బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. వీడియోలు పరిశీలించి విధ్వంసానికి పాల్పడిన వారిపై కేసులు పెడతామన్నారు.
"పోలీసులు వైఫల్యమేమి కాలేదు. పోలీసులందరూ ఘటనాస్థలంలోనే ఉన్నారు. అదుపు చేయాటానికే ప్రయత్నించారు. చిన్న చిన్న ఘటనలు జరిగాయి. టీడీపీ కార్యలయంలోని ఫర్నిచర్ తీసుకువచ్చి బయటుంచి కాల్చి వేశారు. మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఘటనకు పాల్పడిన వారి కోసం గాలిస్తున్నాము. ఎవరు కనబడటం లేదు. పరారీలో ఉన్నారు." -రవిశంకర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ
దాడికి గురైన బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. ఒక్కసారిగా ఇళ్లపైకి వచ్చి దాడులకు పాల్పడినట్లు తెలుగుదేశం నేతల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 100 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా పోలీసులు రాలేదన్నారు. విధ్వంసం జరిగిన తర్వాత వివరాల సేకరణ కోసం వస్తే ఉపయోగమేంటని ప్రశ్నించారు.