ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైసీపీ నేతల నయా దందా.. బిట్​ కాయిన్, 18 కోట్లు వసూలు.. లబోదిబోమంటున్న బాధితులు

By

Published : Dec 4, 2022, 8:48 AM IST

YSRCP Leaders Bitcoin Frauds: రూపాయి కడితే రెండున్నర రూపాయలు, లక్ష చెల్లిస్తే రెండున్నర లక్షలు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. బిట్ కాయిన్ విధానంతో డబ్బులే డబ్బులంటూ నమ్మించి.. జనం నుంచి అధికార పార్టీకి చెందిన నేతలు కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు మాత్రం డబ్బులు పోయాయని కేసులు పెడితే పెట్టుకోండని చేతులెత్తేశారు. చేసేదేమి లేక న్యాయం చేయాలంటూ బాధితులు చిలకలూరిపేట పోలీసుల్ని ఆశ్రయించారు.

Bitcoin Frauds
బిట్​కాయిన్​

రెట్టింపు వడ్డీ పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో జరిగింది. గ్రామ సర్పంచ్ మేరం శ్రీను, మాజీ సర్పంచ్ సాంబశివరావు, గంగాధరరావు అనే వ్యక్తులు ఇందులో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. కట్టుబడివారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత సాంబశివరావు పెద్ద ఇల్లు కట్టుకోవడం, భూములు కొనడం చూసి.. అకస్మాత్తుగా ఎలా సంపాదించాడంటూ చర్చ జరిగింది. బిట్ కాయిన్ విధానంలో పెట్టుబడులు పెట్టానన్న సాంబశివరావు.. లక్ష చెల్లిస్తే ప్రతి నెలా 20 వేల చొప్పున 12 నెలల పాటు మొత్తం 2లక్షల 40 వేలు వచ్చాయని చెప్పాడు. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశించి.. మరికొందరు పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు. ఇదంతా రహస్యంగా జరిగే వ్యాపారం, ఎక్కడా నోరు జారొద్దని వైసీపీ నేతలు నమ్మబలికారు. చాలామంది గ్రామస్థులు పొలం, బంగారం తనఖా పెట్టి, వడ్డీకి డబ్బులు తెచ్చి వైసీపీ నేతలకు అందజేశారు. డబ్బులు ఇస్తున్న సమయంలో కొందరు ముందుజాగ్రత్తగా ఫొన్లో వీడియో తీశారు. సాంబశివరావు మాట్లాడుతున్న దృశ్యాలు, డబ్బులు లెక్కపెట్టుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

నెలలు గడిచినా చెల్లించిన డబ్బులు రాకపోవడంతో గ్రామస్థులు లబోదిబోమంటున్నారు. నేతలు గ్రామంలో 18 కోట్లకుపైనే వసూలు చేసినట్లు సమాచారం. గ్రామసర్పంచ్ ఈ సొమ్ముతో ఆస్తులు కొన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సరైన విచారణ జరిపితే అసలు విషయాలు బయటికొస్తాయంటున్నారు. అధికార పార్టీ నేతలు కావటంతో పైస్థాయి నాయకుల అండదండలు ఉన్నాయని.. అందుకే పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

"ఆరు లక్షలు కడితే 14 లక్షలు వస్తాయని ఆశచూపాడు. పొలం, బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ముత్యాల గంగధరరావుకు కట్టాను. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే సంవత్సరం వరకు వాయిదా వేసుకుంటు వచ్చాడు. ఈ మధ్య అడిగితే పైనున్న వారు ఇవ్వకపోతే నేనేమి చేయలేను అంటున్నాడు." - బాధితుడు

"మా గ్రామంలో దాదాపు 18 కోట్లకు పైగా కట్టారు. మోసం చేసిన వ్యక్తి ఈ మధ్య ఇల్లు కట్టుకున్నాడు. కొడుకును విదేశాలకు పంపించాడు. స్థిరాస్తులు కొనుగోలు చేసాడు. మాకు పురుగుల మందు తాగి చనిపోవటమే గతి." - బాధితుడు

కట్టుబడివారిపాలెంకు చెందిన బాధితులు పల్నాడు జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదును జిల్లా ఎస్పీ.. చిలకలూరిపేట పోలీసులకు పంపించి విచారణకు ఆదేశించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారించారు. అయితే ఇప్పటి వరకూ కేసు మాత్రం నమోదు చేయలేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details