YSRCP Leader Janga Venkata Kotaiah:ఎన్నికల కోడ్ వెలువడక ముందే వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి సీటు ఉంటుందో, ఎవరిది ఊడుతుందోనన్న భయంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆందోళన చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే, పార్టీకి వీర విధేయులుగా ఉన్న వారిని సైతం సర్వేల పేరుతో పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలకు టికెట్ లేదంటూ సీఎం జగన్ కరాఖండిగా చెబుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించే ఆశావాహులు, వైసీపీ జండాపై గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మెుదలైంది. ఎవ్వరి సీటు చిరుగుతుందో, ఎవ్వరికి హాట్ సీట్ లభిస్తుందో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
ఎమ్మెల్యే రేసులో జంగా కృష్ణమూర్తి: పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. తన తండ్రికి టికెట్ ఇవ్వాలంటూ పిడుగురాళ్ల జెడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య తన పదవికి రాజీనామా చేశారు. తమకు టికెట్ రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని, అందుకోసమే తాను తన పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు. గుంటూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ ఏవోకు రాజీనామా పత్రం అందజేశారు. వెంకటకోటయ్య ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కుమారుడు. తాను ఎమ్మెల్యే రేసులో ఉన్నానని, ఇటీవల జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. దీంతో గురజాల ఎమ్మెల్యే మహేష్‌రెడ్డితో ఎమ్మెల్యే కృష్ణమూర్తికి విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న కృష్ణమూర్తి కుమారుడు వెంకటకోటయ్య రాజీనామా చేయడంతో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వైఎస్సార్సీపీ ఆవిర్భావం కంటే ముందు నుంచే, తన తండ్రి కృష్ణమూర్తి జగన్‌తో ఉన్నారని వెంకటకోటయ్య చెప్పారు. పార్టీ కోసం పని చేసినా టికెట్‌పై స్పష్టత ఇవ్వలేదన్నారు.