Young Man Brain Dead: పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తండ్రికి స్వల్ప అనారోగ్య సమస్య రావటంతో సివిల్స్‌కు సిద్ధమవుతున్న కుమారుడు దిల్లీ నుంచి వచ్చి.. ఊహించని రీతిలో బ్రెయిన్ డెడ్‌తో మృత్యువాతపడ్డాడు. వివరాల ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని మూడోవార్డు భీమవరం రోడ్డులో ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు బంకా వాసుబాబు, నాగమణి నివాసముంటున్నారు. వాసుబాబు అచ్చంపేట మండలంలోని వేల్పూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం. నాగమణి సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కాగా ఒక్కగానొక్క కుమారుడైన నిఖిల్ చక్రవర్తి (28) అలియాస్ పండును ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడ్డారు.
నిఖిల్ బీటెక్ పూర్తిచేసి సివిల్స్‌పై దృష్టి సారించాడు. దిల్లీలో ఉంటూ సివిల్స్ శిక్షణ పొందేవాడు. ఒకసారి ప్రిలిమినరీ పరీక్ష కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఈసారి కచ్చితంగా సివిల్స్‌లో సత్తా చాటుతాననే ధీమాతో ఉన్నాడు. నెల క్రితం తండ్రికి అనారోగ్య సమస్య రావడంతో ఇంటికి వచ్చాడు. ఆసుపత్రిలో తండ్రి వెంట ఉంటూ సపర్యలు చేశాడు. తండ్రి ఆరోగ్యవంతుడు కావడంతో త్వరలోనే దిల్లీ వెళ్లాలని సిద్ధమవుతున్నాడు.
Organ Donation in VIMS: జీవన్మృతుడిగా యువకుడు.. చనిపోతూ మరో ఐదుగురికి వెలుగులు
20 రోజుల క్రితం రైల్వేస్టేషన్ రోడ్డులో ద్విచక్ర వాహనం నడుపుతూ నిఖిల్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. చేతులకు, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. చిన్న ప్రమాదనుకుని దాన్ని అశ్రద్ధ చేశాడు. ఈ నెల 11న స్నేహితులతో కలసి ఎడ్యుకేట్ ది సొసైటీ సేవాసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధులకు పండ్లు, రొట్టెల పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.